స్వదేశంలో మళ్లీ ఆట మొదలు | India vs South Africa ODI Series 2020: | Sakshi
Sakshi News home page

స్వదేశంలో మళ్లీ ఆట మొదలు

Published Thu, Mar 12 2020 4:11 AM | Last Updated on Thu, Mar 12 2020 4:55 AM

India vs South Africa ODI Series 2020: - Sakshi

ప్రాక్టీస్‌లో భారత జట్టు సభ్యులు, డి కాక్‌

న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లలో అవమానకరంగా వైట్‌వాష్‌కు గురైన తర్వాత కొంత విరామంతో భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. అయితే ఇప్పుడు వేదిక సొంతగడ్డకు మారింది. గత అక్టోబరులో ఇక్కడే జరిగిన టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా నాటి పర్యటనకు కొనసాగింపుగా ఇప్పుడు కేవలం వన్డేల కోసమే వచ్చింది. స్వదేశంలో ఆస్ట్రేలియాను వన్డేల్లో చిత్తు చేసిన ఉత్సాహంతో సఫారీలు భారత్‌లో అడుగు పెట్టారు. అయితే భారత్‌లో కోహ్లి సేనను నిలువరించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సమరం ఆసక్తికరంగా సాగనుంది.
 
ధర్మశాల: భారత క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ మత్తులోకి వెళ్లే ముందు ఒక స్వల్ప వన్డే సిరీస్‌ను దాటాల్సి ఉంది!  గతంలో నిర్ణయించిన ద్వైపాక్షిక షెడ్యూల్‌ ప్రకారం దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయిు. వరుసగా ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓటముల తర్వాత విజయాన్ని అందుకోవాలని భారత్‌ భావిస్తుండగా... డి కాక్‌ నేతృత్వంలో సత్తా చాటాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు.  

ముగ్గురూ రెడీ
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడిన జట్టుతో పోలిస్తే భారత జట్టులో మూడు ప్రధాన మార్పులు ఖాయమయ్యాయి. గాయాలనుంచి పునరాగమనం చేసిన శిఖర్‌ ధావన్, భువనేశ్వర్‌ కుమార్, హార్దిక్‌ పాండ్యాలు తుది జట్టులో ఉంటారు. కివీస్‌పై ఓపెనింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో సీనియర్‌ ఓపెనర్‌ ధావన్‌ కీలకం కానున్నాడు. అతను తన అసలు సత్తాను ప్రదర్శిస్తే టీమిండియాకు శుభారంభం లభిస్తుంది. మరో ఓపెనర్‌ పృథ్వీ షా కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడితే అతని వన్డే భవిష్యత్తు బాగుంటుంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ మిడిలార్డర్‌లో మళ్లీ చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వీరికి తోడు కెప్టెన్‌ కోహ్లి ఎలాగూ ఉన్నాడు. కివీస్‌ టూర్‌లో ఘోరంగా విఫలమైన విరాట్‌ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాలని ఎదురు చూస్తున్నాడు.

అతనికిదే సరైన వేదిక. బౌలింగ్‌లో బుమ్రాతో పాటు భువనేశ్వర్‌ కుమార్‌ కొత్త బంతిని పంచుకుంటాడు. గాయంనుంచి కోలుకున్న భువీ ఎంత మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరం. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే మూడో పేసర్‌గా సైనీకి చోటు దక్కవచ్చు. అయితే ఆరో స్థానాన్ని తనకంటూ దాదాపుగా ఖరారు చేసుకున్న మనీశ్‌ పాండేను తీసుకుంటారా అనేదే ప్రశ్న. పాండ్యా స్థానంలో వచ్చినప్పటినుంచి ఆల్‌రౌండర్‌గా జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పుడు పాండ్యా రాకతో అతడిని తప్పిస్తారా లేక ఇద్దరు ఆల్‌రౌండర్లను కొనసాగించి పాండేను పక్కన పెడతారా చూడాలి.  బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో కెప్టెన్‌ కోహ్లి, పాండ్యా పాల్గొనలేదు.

సీనియర్లే కీలకం...
గత అక్టోబరులో భారత్‌లో పర్యటించినప్పుడు టి20 సిరీస్‌ను సమం చేసిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. తదనంతర పరిణామాల్లో డు ప్లెసిస్‌ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. డి కాక్‌ సారథ్యంలో ఇటీవలే ఆస్ట్రేలియాను వన్డేల్లో 3–0తో చిత్తు చేసి సఫారీలు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. బ్యాటింగ్‌లో ఆ జట్టుకు కెప్టెన్, మాజీ కెప్టెన్‌తో పాటు డేవిడ్‌ మిల్లర్‌ అనుభవం కీలకం కానుంది. వీరిని మినహాయిస్తే ఎక్కువ మందికి అనుభవం లేకపోవడం జట్టు ప్రధాన లోటు. అందులోనూ భారత గడ్డపై కొత్త ఆటగాళ్లు తొలి పర్యటనలో రాణించడం చాలా కష్టం.

కాబట్టి ఆ జట్టు విజయావకాశాలు ముగ్గురి బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. బవుమా, వాన్‌ డర్‌ డసెన్, క్లాసెన్‌ బ్యాటింగ్‌ భారాన్ని మోయాల్సి ఉంది. చివరి నిమిషంలో జట్టులో చేరిన జేన్‌మన్‌ మలాన్‌కు స్థానం దక్కుతుందా చూడాలి.  రబడ లాంటి స్టార్‌ బౌలర్‌ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఫలితంగా పేస్‌ బౌలింగ్‌ అంతంత మాత్రంగా ఉంది. అయితే ఇక్కడి పిచ్‌పై తాము ప్రభావం చూపించగలమని పేసర్లు నమ్మతున్నారు. ఇన్‌గిడి ప్రధాన పేసర్‌ కాగా...నోర్జే, హెన్‌డ్రిక్స్‌లు సహకరిస్తారు.

తుది జట్లు (అంచనా):  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, పృథ్వీ షా, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా/ పాండే, భువనేశ్వర్, సైనీ, చహల్, బుమ్రా.  

దక్షిణాఫ్రికా: డి కాక్‌ (కెప్టెన్‌), బవుమా/ మలాన్, వాన్‌ డర్‌ డసెన్, డు ప్లెసిస్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్‌వాయో, కేశవ్‌ మహరాజ్, నోర్జే, ఇన్‌గిడి, హెన్‌డ్రిక్స్‌

పిచ్, వాతావరణం
చల్లటి వాతావరణం, తేమ కారణంగా మొదటినుంచి ఇక్కడి పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుంది. గతంలో చూస్తే రెండో బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు నెగ్గాయి. అయితే మ్యాచ్‌ రోజు వర్షం ముప్పు పొంచి ఉంది. పూర్తిగా గానీ ఏదో ఒక సమయంలో గానీ వాన ఇబ్బంది కలిగించవచ్చు. సెప్టెంబరులో ఇరు జట్ల మధ్య జరగాల్సిన టి20 మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది.  

‘కరోనా భయం కారణంగా బంతి మెరుపు పెంచేందుకు ఈ సారి ఉమ్మును  వాడరాదని మేమూ అనుకుంటున్నాం. అయితే దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఎందుకంటే అలా చేయకపోతే మెరుపు రాబట్టేది ఎలా! ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ మా బౌలింగ్‌ను చితక్కొడతారు. మీరేమో బౌలింగ్‌ బాగా చేయడం లేదని, విఫలమయ్యాడని అంటారు. డాక్టర్ల సలహా తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం’
 –భువనేశ్వర్‌ కుమార్, భారత బౌలర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement