మరో సిరీస్‌ పై దృష్టీ | India vs Sri Lanka, 3rd ODI, Pallekele | Sakshi
Sakshi News home page

మరో సిరీస్‌ పై దృష్టీ

Published Sun, Aug 27 2017 1:23 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

మరో సిరీస్‌ పై దృష్టీ

మరో సిరీస్‌ పై దృష్టీ

శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే నేడు
సజీవంగా నిలిచేందుకు ఆతిథ్య జట్టు పోరు


శ్రీలంక పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు రెండో వన్డేలో కఠిన పోటీ ఎదురైంది. స్పిన్నర్‌ అకిల ధనంజయ స్పిన్‌ మాయలో పడి టీమిండియా ఒక్కసారిగా ఓటమి దిశగా పయనించింది. 22 బంతుల వ్యవధిలో ఏడు వికెట్లు కూలినా... ‘మిస్టర్‌ కూల్‌’ ధోనికి అనూహ్యంగా భువనేశ్వర్‌ అండగా నిలవడంతో పరువు దక్కించుకోగలిగింది. ఈ పరిస్థితిలో శ్రీలంకతో కోహ్లి సేన మూడో వన్డేకు సిద్ధమవుతోంది. మిడిలార్డర్‌ వైఫల్యాన్ని అధిగమించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలవాలని భారత్‌ భావిస్తుండగా... ఎలాగైనా ఈ వన్డేలో నెగ్గి సిరీస్‌లో సజీవంగా ఉండాలని ఆతిథ్య జట్టు ఆలోచిస్తోంది.

పల్లెకెలె: శ్రీలంక పర్యటనలో ఇప్పటికే టెస్టు సిరీస్‌ను దక్కించుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో నేడు మూడో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే సిరీస్‌ భారత్‌ ఖాతాలో చేరుతుంది. అయి తే గురువారం నాటి రెండో వన్డేలో వరుస మారిన భారత మిడిలార్డర్‌లో లోపాలు బహిర్గతమయ్యాయి. ధనంజయ స్పిన్‌ తాకిడిని తట్టుకోలేక ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు చేర డం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో ప్రయోగాలు చేసినా ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలనే కసితో లంక ఉంది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ ఉపుల్‌ తరంగపై రెండు వన్డేల నిషేధం విధించడంతో శ్రీలంక జట్టుకు కపుగెడెర నాయకత్వం వహించనున్నాడు.

ప్రయోగాలు కొనసాగేనా..
రెండేళ్లలో రాబోయే ప్రపంచకప్‌కు అత్యంత పటిష్టంగా సిద్ధం కావాలని భారత్‌ భావిస్తోంది. దీంట్లో భాగంగానే రెగ్యులర్‌గా కొనసాగుతున్న బ్యాటింగ్‌ ఆర్డర్‌ను రెండో వన్డేలో మార్చారు. మూడోనంబర్‌లో కోహ్లికి బదులు రాహుల్, ఆ తర్వాత కేదార్‌ జాదవ్‌లను బరిలోకి దింపారు. అయితే స్పిన్నర్‌ ధనంజయ గూగ్లీ బంతులకు వీరు గుభేల్‌మన్నారు. ఫామ్‌లో ఉన్నప్పటికీ లోకేశ్‌ రాహుల్‌ కోసం రహానే బెంచీకే పరిమితమయ్యాడు. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని రాహుల్‌ ఉపయోగించుకోలేకపోయాడు. అయితే ధనంజయ సూపర్‌ బంతులకు అటు కోహ్లి కూడా షాక్‌ తినాల్సి వచ్చింది. జాదవ్‌ తన షాట్‌ సెలక్షన్‌లో విఫలమయ్యాడు. మరి ఈ వన్డేలోనూ కోహ్లి ఇదే ఆర్డర్‌లో జట్టును నడిపిస్తాడా.. వేచి చూడాలి.

ఎక్కువగా చేజింగ్‌కు మొగ్గు చూపే అతను ఈసారి టాస్‌ నెగ్గితే మిడిలార్డర్‌ ప్రాక్టీస్‌ కోసం ముందుగా బ్యాటింగ్‌ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కండరాలు పట్టేయడంతో హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా... లేడా అనేది ఆసక్తికరంగా మారింది. ఫిట్‌గా లేకపోతే కుల్దీప్, శార్దుల్‌ ఠాకూర్‌లలో ఒకరికి చాన్స్‌ ఉంటుంది. ధోని తన సత్తా ఏమిటో చాటుకోగా... భువనేశ్వర్‌ బౌలింగ్‌లో విఫలమవుతున్నా అసమాన బ్యాటింగ్‌తో రెండో వన్డేలో ఆపద్భాందవుడిలా నిలిచాడు. పేసర్‌ బుమ్రా అదరగొడుతుండగా, స్పిన్నర్లు అక్షర్, చాహల్‌ ప్రభావం చూపిస్తున్నారు.

ఒత్తిడిలో శ్రీలంక
కెప్టెన్‌ తరంగ సస్పెన్షన్‌తో పాటు గుణతిలక గాయంతో దూరమవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. దీంతో వీరిద్దరి స్థానంలో చండిమాల్, తిరిమన్నె జట్టులోకి వచ్చారు. రెండో వన్డేలో గెలుపు ముంగిట నిలిచి బోల్తా పడిన లంక ఈసారి ఎలాంటి పొరపాటుకు తావీయకుండా ఆడాలని చూస్తోంది. సిరీస్‌లో ఉండాలంటే విజయం తప్పనిసరి కావడంతో పాటు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే లంకకు రెండు విజయాలు అవసరముంది. ముఖ్యంగా లంక బౌలింగ్‌లో ఇప్పుడు ధనంజయ సరికొత్త ఆశాకిరణంగా మారాడు. ఈ మ్యాచ్‌లోనూ జట్టు అతడిపైనే భారం వేసింది. అయితే పేసర్లు మలింగ, ఫెర్నాండో ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం వీరిని దెబ్బతీస్తోంది.  

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, జాదవ్, పాండ్యా, ధోని, అక్షర్, చాహల్, భువనేశ్వర్, బుమ్రా.

శ్రీలంక: కపుగెడెర (కెప్టెన్‌), డిక్‌వెలా, తిరిమన్నె, కుశాల్, చండిమాల్, మాథ్యూస్, సిరివర్ధన, ధనంజయ, చమీర, ఫెర్నాండో, మలింగ.  

పిచ్, వాతావరణం
రెండో వన్డే మాదిరిగానే పిచ్‌ మరోసారి స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించనుంది. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.

మధ్యాహ్నం గం. 2.30 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement