భారత జట్టు ఈ ఏడాది 27 వన్డేలు ఆడితే 18 గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌లలో ఓడగా, మరొకటి రద్దయింది. ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన టీమిండియా... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను వారి సొంతగడ్డపైనే ఓడించి మూడు సిరీస్ విజయాలు సాధించింది. అయితే స్వదేశంలో మాత్రం ఆసీస్ చేతిలో సిరీస్ చేజార్చుకున్న మన టీమ్ ఇప్పుడు ఏడాది చివరి సిరీస్ చివరి మ్యాచ్ పోరుకు సన్నద్ధమైంది. గత మ్యాచ్ తరహాలోనే వెస్టిండీస్‌ను చిత్తు చేసి 2019ని ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. ఐదేళ్ల తర్వాత ఇటీవలే అఫ్గానిస్తాన్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన విండీస్ కూడా మరో గెలుపుతో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
కటక్: భారత్, వెస్టిండీస్ పోరు చివరి ఘట్టానికి చేరింది. టి20 సిరీస్‌ను భారత్ గెలుచుకున్న అనంతరం జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరొకటి నెగ్గి సమ ఉజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో నేడు భారత్, విండీస్ తలపడనున్నాయి. బలాబలాలపరంగా ఇప్పటికీ భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... ఈ పర్యటనలో ప్రత్యర్థి ఆటను చూస్తే వారిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కోహ్లి సేన తమ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంటుందా అనేది ఆసక్తికరం.
బౌలింగ్‌లో సమస్య!
గాయం కారణంగా దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన నవదీప్ సైనీ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఒత్తిడితో నిండిన చివరి పోరులో అతడికి అవకాశం ఇస్తే ఏమాత్రం ప్రభావం చూపగలడనేది కీలకం. మరో పేసర్ శార్దుల్ కూడా అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో సీనియర్ షమీపై భారం మరింత పెరిగింది. వైజాగ్ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ మరోసారి కీలకం కానున్నాడు. అయితే భారత్ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుందా చూడాలి. అదే జరిగితే శార్దుల్ స్థానంలో చహల్‌కు అవకాశం దక్కవచ్చు. కోహ్లిలాంటి స్టార్ ‘సున్నా’ చుట్టిన తర్వాత కూడా జట్టు 387 పరుగులు సాధించిందంటే టీమిండియా బ్యాటింగ్ సామర్థ్యం ఏమిటో అంచనా వేయవచ్చు.
ఓపెనర్లు రోహిత్, రాహుల్ తిరుగులేని బ్యాటింగ్ మరోసారి భారత్‌కు శుభారంభం అందిస్తే ప్రత్యరి్థకి కష్టాలు తప్పవు. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు బంతులు ఎదుర్కొని కోహ్లి నాలుగు పరుగులు మాత్రమే చేయడం ఆశ్చర్యకరం! అయితే అతని స్థాయికి తర్వాతి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారించడం పెద్ద కష్టం కాదు. బరాబతి స్టేడియంలో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 3, 22, 1, 8 పరుగులు మాత్రమే చేసిన కోహ్లికి ఇప్పుడు దానిని కూడా సవరించే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లు అయ్యర్, పంత్ జంటగా చెలరేగిపోవడం శుభ పరిణామం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో జాదవ్, జడేజా కూడా తమ వంతు పాత్ర పోషించగలరు. మొత్తంగా బౌలింగ్ కాస్త బలహీనపడిన కారణంగా భారత బ్యాటింగ్ బలగం తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఆడితే గెలుపు ఖాయం.
మార్పుల్లేకుండానే...
విశాఖ వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడంలో విండీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా కాట్రెల్‌ను కోలుకోలేని విధంగా మనోళ్లు దెబ్బ కొట్టారు. అయితే ఐపీఎల్‌లో భారీ మొత్తానికి అమ్ముడై ఉత్సాహంగా ఉన్న కాట్రెల్ మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి జోసెఫ్, హోల్డర్ అండగా నిలవడం ముఖ్యం. స్పిన్నర్ ఖారీ పైర్ భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో మెరుగైన గణాంకాలే నమోదు చేశాడు కాబట్టి ఈసారి కూడా అతని నుంచి పొదుపైన బౌలింగ్‌ను విండీస్ ఆశిస్తోంది. బ్యాటింగ్‌లో హోప్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ లూయిస్ కూడా చెలరేగిపోగలడు.
రెండో వన్డేలో అనూహ్యంగా రనౌట్ కాకుండా ఉంటే హెట్‌మైర్ కూడా మ్యాచ్‌ను శాసించేవాడు. తాజాగా ఐపీఎల్ వేలం తర్వాత అతని ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపైంది. హెట్‌మైర్‌ను భారత్ నిలువరించలేకపోతే కష్టం. పూరన్ బ్యాటింగ్ మెరుపులు కూడా గత మ్యాచ్‌లో కనిపించాయి. అయితే కెప్టెన్ పొలార్డ్ మాత్రం చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. కెపె్టన్ కావడంతో పాటు విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా తనకున్న గుర్తింపును బట్టి ఒక్కటైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని వెస్టిండీస్ కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌లోనైనా పొలార్డ్ ప్రభావం చూపగలడా అనేది ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, షమీ, కుల్దీప్, సైనీ, శార్దుల్/చహల్.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, లూయిస్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్, కీమో పాల్, జోసెఫ్, పైర్, కాట్రెల్,
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ మైదానంలో వన్డే జరిగి మూడేళ్లయింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాటి మ్యాచ్‌లో ఏకంగా 747 పరుగులు నమోదయ్యాయి. మంచు ప్రభావం కూడా ఉంది కాబట్టి మరోసారి టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపడం ఖాయం. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment