తొలి టి20 మ్యాచ్ కూడా టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే సాగింది. భారత్‌ను కొంత ఇబ్బందిలో పడేయగలిగినా... వెస్టిండీస్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఒషాన్ థామస్ తన పేస్, బౌన్స్‌తో పాత వెస్టిండీస్ భీకర ఫాస్ట్ బౌలింగ్‌కు గుర్తు చేయగా, తన ఎత్తును నమ్ముకున్న కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ చక్కటి లెంగ్త్‌తో భారత బ్యాట్స్‌మెన్ వెనకడుగు వేసేలా చేశాడు. వేగంతో దూసుకొచ్చిన షార్ట్ బంతులను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హెల్మెట్‌ల వాడకం పెరగడం, ఓవర్లో ఒకే బౌన్సర్‌కు అనుమతివంటి నిబంధనలు వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా మందిలాగే మన ఆటగాళ్లు కూడా బ్యాక్‌ఫుట్‌పై ఆడటం మరచిపోయారు.
అయితే టి20ల్లో ఒక బౌలర్ గరిష్టంగా 4 ఓవర్లే వేయగలిగే అవకాశం ఉండగా థామస్‌కు అండగా నిలిచే మరో ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ జట్టులో ఎవరూ లేరు. ఫలితంగా భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థిని సునాయాసంగా ఎదుర్కొని జట్టును గెలిపించారు. విండీస్ చాలా కాలంగా కోరుకుంటున్న మెరుగైన ఫాస్ట్ బౌలర్ అయ్యే అవకాశం థామస్‌కు ఉంది. షెనాన్ గాబ్రియెల్ బౌలింగ్‌లోనూ వేగం ఉన్నా తన తొలి స్పెల్‌లోనే ఎక్కువగా షార్ట్ బంతులు విసిరే లక్షణం అతనికి ఉంది. అలా కాకుండా థామస్ భారత బ్యాట్స్‌మెన్‌ను క్రీజ్‌లో ఒక ఆటాడించాడు. వారికి అతి దగ్గరి నుంచి అతని బంతులు దూసుకుపోయాయి.
అయితే ఈడెన్ గార్డెన్స్‌లో కొంత బౌన్స్ ఉండటం అనుకూలించింది. కానీ లక్నోలో అతనికి అంత సహకారం లభించకపోవచ్చు. ఈ కొత్త వేదిక గురించి భారత ఆటగాళ్లకు కూడా పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు తాము టాస్ ఓడిపోయి పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలని కోరుకునే అవకాశమే ఉంది. దినేశ్ కార్తీక్ మరోసారి తన విలువను చూపిస్తూ జట్టును విజయతీరం చేర్చాడు. అతడికి అండగా నిలిచిన కొత్త ఆటగాడు కృనాల్ పాండ్యా పరిస్థితికి తగినట్లుగా ఆడి భారత్ తరఫున ఆడే అర్హత తనకు ఉందని నిరూపించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు
ఇక్కడ భారత జట్టు తరఫున కూడా అంతే సౌకర్యంగా కనిపించాడు. మరో కొత్త ఆటగాడు ఖలీల్ అహ్మద్ కూడా చక్కగా బౌలింగ్ చేయగా... విండీస్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన పియర్, అలెన్ కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా ఇరు జట్ల నుంచి కొత్తవాళ్లకు ఈ మ్యాచ్ గుర్తుండిపోయేలా సాగింది. సిరీస్‌లో నిలవాలంటే లక్నోలో కచ్చితంగా గెలవాల్సిన ప్రపంచ చాంపియన్ ఈడెన్ గార్డెన్స్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో మరింత పట్టుదల కనబర్చాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment