విదేశీ పరాజయాలను మరపున పడేసేందుకు... ఎప్పటిలా స్వదేశంలో పులిలా చెలరేగేందుకు... టీమిండియా ముంగిట ఓ అవకాశం! విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి... రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల వేటకు ఓ రాచ మార్గం! రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో నేటి నుంచే తొలి టెస్టు... ప్రతిభ ఉన్నా అనుభవం లేని ప్రత్యర్థి... ఐదు రోజుల సమరంలో ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాలి.
రాజ్‌కోట్: పసికూన అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టును వదిలేస్తే... దాదాపు 10 నెలల తర్వాత సొంతగడ్డపై భారత్‌కు పూర్తి స్థాయి టెస్టు సిరీస్. బలహీనమైనదే అయినా, పూర్తిగా తీసిపారేయలేని వెస్టిండీస్‌తో సమరం. ఇందులో భాగంగా గురువారం నుంచి రాజ్‌కోట్‌లో తొలి పోరు. ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌కు ముందు రోజే 12 మంది సభ్యుల జట్టును ప్రకటించడం టీమిండియా తరఫున ఓ విశేషమైతే... సంచలనాల యువ పృథ్వీ షా అరంగేట్రం ఖాయమవడం ఇంకో విశేషం. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్‌కు తప్పని నిరీక్షణ. కూర్పులో అనూహ్య మార్పుతో ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికీ దక్కని అవకాశం. ఎప్పటిలా స్పిన్‌కు కాకుండా పేస్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేశారన్న అంచనాల మధ్య కొంత ఆసక్తికరంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
పేసరా? స్పిన్నరా?
కోహ్లి సేన ఐదుగురు బౌలర్లతో బరిలో దిగనున్న నేపథ్యంలో కూర్పు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లుగా ఉంటుందా? ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆల్‌రౌండర్ అందుబాటులో లేనందునే... సంప్రదాయంగా వస్తున్న నలుగురు బౌలర్ల వ్యూహాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు అశ్విన్‌లను ఆల్‌రౌండర్లుగా పరిగణించినా, మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను తీసుకుంటారో? లేక పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎంచుకుంటారో చూడాలి. ఇక బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా మయాంక్‌ను దింపుతారని అంతా ఆశిస్తే, అనూహ్యంగా పృథ్వీ షా పేరును ప్రకటించారు. పుజారా, కోహ్లి, రహానేలతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. తాను నాలుగు శతకాలు చేసిన ప్రియమైన ప్రత్యర్థిపై బ్యాట్‌తో రాణించేందుకు అశ్విన్ సిద్ధంగా ఉన్నాడు. సొంతగడ్డ కాబట్టి రవీంద్ర జడేజా నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ ఆశించొచ్చు. స్పిన్నర్లతో పాటు ప్రధాన పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్‌లను ఎదుర్కోవడం విండీస్‌కు
కఠిన పరీక్షే. అనుభవం లేకున్నా సత్తాగలదే...
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరుచుకుపడే నాణ్యమైన ఆటగాళ్లు టెస్టులకు మొహం చాటేస్తున్నా... ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ నేతృత్వంలోని వెస్టిండీస్‌ను సంప్రదాయ ఫార్మాట్‌లో తక్కువగా చూడలేం. ఇటీవల సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌ను 1–1తో డ్రా చేసుకుని, బంగ్లాదేశ్‌పై 2–0తో విజయం సాధించి ఆ జట్టు ఫామ్‌లో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలోనూ లీడ్స్‌లో టెస్టు నెగ్గింది. అయితే, కెప్టెన్ హోల్డర్ సహా చాలామంది ఆటగాళ్లకు భారత్‌లో ఆడిన అనుభవం లేకపోవడం ప్రధాన లోటు. ప్రస్తుత జట్టులో ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షనన్ గాబ్రియెల్, దేవేంద్ర బిషూ మాత్రమే గతంలో ఇక్కడ పర్యటించారు. పేసర్ కీమర్ రోచ్ సైతం ఆడినా అతడు తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. వీటన్నిటిని పక్కన పెడితే ఈ జట్టుకు ప్రతిఘటనతో మ్యాచ్‌లను రసవత్తరంగా మార్చగల సత్తా ఉన్నది. బ్రాత్‌వైట్, షై హోప్, రోస్టన్ ఛేజ్ కఠిన పరిస్థితుల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. వికెట్ కీపర్ షేన్ డౌరిచ్, హోల్డర్ లోయరార్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్. ఎటొచ్చి అటు పేస్‌లో ఇటు స్పిన్‌లోనూ బలహీనంగా కనిపిస్తోంది. షనన్ గాబ్రియెల్‌కు తోడుగా కీమో పాల్, షర్మన్ లూయీస్‌లలో ఒకరు రెండో పేసర్‌గా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరూ కొత్తవారే. బిషూ, జొమెల్ వారికన్, పార్ట్ టైమర్ చేజ్‌లతో కూడిన స్పిన్‌ను ఆడటం భారత బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా ఇబ్బందే కాదు. ఇలాంటి పరిమిత వనరులతో వెస్టిండీస్ ఎలా ఆడుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్లదే బాధ్యత. తుది జట్టులోకి తీసుకునే విషయంపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొదటి నుంచి జట్టుతోనే ఉన్నా ఒక్క మ్యాచ్‌లో కూడా కరుణ్ నాయర్‌ను ఆడించకపోవడంపై విమర్శలు చెలరేగినా... ఈ అంశంపై ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ తగిన వివరణ ఇచ్చారు. ఆయన ఒకసారి వివరణ ఇచ్చాక మళ్లీ నేనిక్కడ మాట్లాడటం అనవసరం. ఎవరికి అప్పజెప్పిన బాధ్యతలు వారు ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. టాపార్డర్ మెరుగైన ప్రదర్శన కనబర్చడం మినహా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి కొత్తగా మరేమీ ఆశించడం లేదు.
–విరాట్ కోహ్లి
పిచ్, వాతావరణం
పిచ్ రెండున్నర రోజులు బ్యాటింగ్‌కు అనుకూలం. తర్వాత స్పిన్‌కు సహకరిస్తుంది. కానీ, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని బౌన్సీ పిచ్ తయారు చేయాల్సిందిగా క్యురేటర్‌కు బీసీసీఐ సూచనలు చేసిందన్న వార్తలతో ఏ విధంగా స్పందిస్తుందో మ్యాచ్ సాగే తీరును బట్టి తేలనుంది. టెస్టు జరిగే ఐదు రోజుల్లో వర్ష సూచన లేదు.
జట్లు (అంచనా)
భారత్: కేఎల్ రాహుల్, పృథ్వీ షా, పుజారా, కోహ్లి, రహానే, పంత్, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్, కుల్దీప్/శార్దూల్.
విండీస్: బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షై హోప్, సునీల్ ఆంబ్రిస్, ఛేజ్, హేట్‌మెయిర్, డౌరిచ్, హోల్డర్, కీమో పాల్, గ్రాబియెల్, బిషూ.
►భారత గడ్డపై వెస్టిండీస్ జట్టు టెస్టు గెలిచి 24 ఏళ్లు గడిచాయి. విండీస్ జట్టు చివరిసారి 1994లో భారత్‌లో టెస్టు గెలిచింది. ఆ తర్వాతి కాలంలో భారత్‌లో ఆ జట్టు కేవలం ఎనిమిది టెస్టులు మాత్రమే ఆడింది.
► ఉదయం గం. 9.20 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment