
ధోని సేన విజేతగా నిలుస్తుంది
వన్డే ప్రపంచకప్‌పై సచిన్ టెండూల్కర్
బ్రాడ్‌మన్ ప్రశంస గర్వకారణం
ముంబై: భారత వన్డే క్రికెట్ జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పూర్తి విశ్వాసముంచాడు. అన్ని రకాలుగా సమతుల్యంతో ఉన్న ధోని సేన వచ్చే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. మరో ఐదు నెలల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వరల్డ్ కప్ జరిగే విషయం తెలిసిందే. ‘ప్రస్తుత వన్డే జట్టు బహుముఖ ప్రతిభ కలిగి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో కుడి, ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌తో సమతూకంగా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యం కనిపిస్తోంది. ఫీల్డింగ్ విషయంలోనూ లోపాలు కనిపించడం లేదు. కచ్చితంగా డిఫెండింగ్ చాంప్ భారత్ మళ్లీ విజేతగా నిలుస్తుంది. ఆసీస్, కివీస్‌లోనే 1991-92లో జరిగిన ప్రపంచకప్ నాకు కొన్ని మధుర స్మ ృతులను మిగిల్చింది’ అని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నిర్వహించిన ఈ స్పోర్టింగ్ ఈవెంట్‌లో ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనకు క్లబ్ జీవిత కాల సభ్యుడి హోదాను ఇచ్చారు. భారత్, ఆసీస్ జట్లకు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టును ఓడించడమే కోరికగా ఉందని అబాట్ సరదాగా అన్నారు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు బ్రెట్ లీ, గిల్‌క్రిస్ట్ యువ క్రికెటర్లను సన్మానించారు. క్రీడలు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతాయని, ఆరోగ్యం, ఏకాగ్రతను ఇవి పెంపొదిస్తాయని చిన్నారులకు సచిన్ వివరించాడు.
‘బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాలు అద్భుతం’
ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత బ్యాట్స్‌మన్‌గా కీర్తించే డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను కలుసుకున్న సంఘటన తన జీవితంలో అత్యంత సంతోషదాయకమైందని సచిన్ అన్నాడు. ‘బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను.
మన ఇద్దరి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉందని చెప్పిన బ్రాడ్‌మన్ కితాబు జీవితంలో నాకు దక్కిన అత్యంత గౌరవం. అలాగే ఆయన తయారుచేసిన ఆల్ టైమ్ టెస్టు ఆటగాళ్ల జాబితాలో నాపేరు ఉండడం గర్వకారణం. ఆ 11 మంది ఆటగాళ్లతో కూడిన ఫొటో ఫ్రేమ్ నా దగ్గర ఉంది. దాన్ని విలువైన సంపదగా భావిస్తాను’ అని సచిన్ చెప్పాడు.