
న్యూఢిల్లీ: భారత క్రికెట్ ఆపరేషన్స్ జీఎంగా, మహిళల క్రికెట్ జట్టుకు ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ క్రికెటర్ సాబా కరీం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు డైలీ అలెవన్స్(డీఏ) రూపంలో ఇవ్వాల్సిన నగదును ఇవ్వకుండా సాబా కరీం అలసత్వం ప్రదర్శించాడు. దాంతో తమ అకౌంట్‌లో నగదు ఉంటుందనుకుని భావించిన భారత మహిళా క్రికెట్ జట్టు బృందం.. తమ అకౌంట్‌లు చూసుకుని ఒక్కసారిగా షాకయ్యింది.
భారత క్రికెట్ జట్ల ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ గత నెల 18 వరకూ వినోద్ రాయ్ నేతృత్వంలోని క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) చూసేది. అయితే బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాన్ని సాబా కరీంకు అప్పచెప్పింది. దీనిపై సెప్టెంబర్ 23వ తేదీనే కరీంకు మెయిల్ పంపారు. అయితే అక్టోబర్ 24వరకూ ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి సాబా కరీం ఏమీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే భారత మహిళా జట్టు.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడంతో నగదు సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే బీసీసీఐకు తెలియజేయడంతో కొత్త నియమించబడ్డ కార్యవర్గం జోక్యంతో డీఏను ఆగమేఘాలపై బదిలీ చేయాల్సివచ్చింది.
కాగా, ఈ వ్యవహారాన్ని చూడాల్సిన సాబా కరీంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. విదేశీ పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు వెళ్లిన తరుణంలో ఇలాగేనా వ్యవహరించేది అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మండిపడ్డారు. ‘ ఇది చాలా సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం. మన అమ్మాయిలు విదేశీ గడ్డపై అడుగుపెట్టినప్పుడు కనీసం వారి అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా లేకుండా పంపుతారా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచే ఫైనాన్స్ వ్యవహారాలు సీఓఏ నుంచి క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబా కరీం చేతికి వస్తే.. అక్టోబర్ 24వ తేదీ వరకూ ఎందుకంత నిర్లక్ష్యం వహించారు. భారత మహిళా క్రికెటర్లకు డీఏ ఇవ్వవపోవడం వారి ఇబ్బందులు పడ్డారు’ అని సదరు అధికారి సీరియస్ అయ్యారు. విండీస్ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment