
హిట్‌మ్యాన్ రోహిత్, అంబటి రాయుడు సెంచరీలతో చెలరేగిన వేళ.. బౌలింగ్‌లో ఖలీల్, కుల్‌దీప్ మెరిసిన సమయాన.. ఫీల్డింగ్‌లో జట్టు సమష్టి తత్వంతో.. నాలుగో వన్డేలో భారత్ జూలు విదిల్చింది. చాంపియన్ ఆటతీరుతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. 2–1తో సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది.
ముంబై: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... ఓపెనర్ రోహిత్ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరుగుతుంది.
శుభారంభం... ఆపై అమోఘం
మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. రోహితే ముందుగా మొదలుపెట్టినా, కొద్దిసేపటికే జోరందుకున్న శిఖర్ ధవన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లతో అతడిని మించిపోయాడు. అయితే, కీమో పాల్ ఓవర్లో పుల్ చేయబోయి మిడ్ వికెట్‌లో రావ్‌మాన్ పాల్‌కు చిక్కాడు. దీంతో 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హ్యాట్రిక్ సెంచరీల ఊపులో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (16) ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో రోహిత్, రాయుడు బాధ్యత తీసుకున్నారు. కుదురుకున్న తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో అలెన్ బౌలింగ్‌లో ఫోర్‌తో రోహిత్ 21వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
కాసేపటికే రాయుడు అర్ధశతకం చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి ఫోర్లు, సిక్స్‌లతో ఇద్దరూ ధాటైన ఆట కనబర్చారు. కావాల్సినన్ని ఓవర్లు ఉండటం, 150 మైలురాయి (131 బంతుల్లో) కూడా అధిగమించడంతో రోహిత్ డబుల్ సెంచరీ ఖాయమని అంతా భావించారు. కానీ నర్స్ బౌలింగ్‌లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని కట్ చేసే యత్నంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 211 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రోచ్ ఓవర్లో సిక్స్ బాది 90ల్లోకి చేరుకున్న రాయుడు... కాసేపటికే మూడో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రనౌటయ్యాడు. ధోని (15 బంతుల్లో 24; 2 ఫోర్లు), కేదార్ జాదవ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా (4 బంతుల్లో 7; 1 ఫోర్ నాటౌట్) ఆఖర్లో తమవంతుగా జట్టు స్కోరును పెంచారు.
విండీస్ ఏ దశలోనూ...
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ చందర్‌పాల్ హేమరాజ్(14)ను ఔట్ చేయడం ద్వారా వికెట్ల పతనానికి భువనేశ్వర్ తెర తీశాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్ ధాటికి కీరన్ పావెల్(4), షై హోప్(0) వెంట వెంటనే వెనుదిరిగారు. బౌలింగ్ మార్పులో భాగంగా బంతి అందుకున్న ఖలీల్ తొలుత హెట్‌మైర్(13)ను ఎల్బీడబ్ల్యూగా, ఆ తర్వాత రోమ్‌మెన్ పావెల్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 47 పరుగులకే విండీస్ సగం వికెట్ల కోల్పోయింది. ఆ తర్వాత అనుభవజ్ఞుడు శామ్యూల్స్ (18) సైతం వెనుదిరగడంతో విండీస్ 100కే ఆలౌట్ అవుతుందనిపించింది. అయితే కెప్టెన్ హోల్డర్(54 నాటౌట్) పోరాడడంతో చివరికి 153 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జడేజా, భువనేశ్వర్ తలో వికెట్ సాధించారు.
చదవండి: భారత్‌తో నాలుగో వన్డే : విండీస్ ముందు భారీ లక్ష్యం
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment