
సాక్షి, విజయవాడ: భారత ‘ఎ’ బౌలర్ల ముందు న్యూజిలాండ్ ‘ఎ’ బ్యాట్స్‌మెన్ ఎదురునిలువలేకపోయారు. కనీసం ‘డ్రా’తో గట్టెక్కాలన్నా... కివీస్ బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాల్సిన చోట చేతులెత్తేశారు. ఫలితంగా రెండో టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 104/1తో ఆట చివరిరోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు 79.3 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. భారత ‘ఎ’ స్పిన్నర్లు కరణ్ శర్మ (5/78), షాబాజ్ నదీమ్ (4/41) కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీయగా... మరో వికెట్ పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు దక్కింది.
ఒక దశలో 158/2తో పటిష్టంగానే కనిపించిన కివీస్ ఆ తర్వాత భారత స్పిన్నర్ల ధాటికి మిగతా ఎనిమిది వికెట్లను 52 పరుగుల తేడాతో కోల్పోయింది. కెప్టెన్ హెన్రీ నికోల్స్ (190 బంతుల్లో 94; 11 ఫోర్లు, ఒక సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ విజయంతో భారత్ రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఇక్కడే జరిగిన తొలి టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు అనధికారిక వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఈనెల 6న ఇదే వేదికపై మొదలవుతుంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 211; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 447; న్యూజిలాండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 210 (జీత్ రావల్ 47, నికోల్స్ 94; నదీమ్ 4/41, కరణ్ శర్మ 5/78).
Comments
Please login to add a commentAdd a comment