
చెన్నైలో సఫారీలు చిత్తు
కీలక వన్డేలో భారత్ సమిష్టిగా రాణించింది. విజయ దశమి నాడు.. దక్షిణాఫ్రికాతో ఇక్కడ చిదంబరం స్టేడియంలో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ వీరోచిత సెంచరీ వృధా అయ్యింది. 300 పరుగుల భారీలక్ష్యంతో బరిలో దిగిన సౌతాప్రికా పరుగుల వేటలో చతికిల బడింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 50ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఐదు వన్డేల ఫ్రీడమ్ సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసినట్లైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియా విరాట్ కోహ్లీ (138; 140 బంతుల్లో 6 ఫోర్లు,5 సిక్స్ లు) సెంచరీతో చెలరేగడంతో భారత్ 50 ఓవర్లకు 299 పరుగులు చేసింది. సిరీస్ లో నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 35 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ(21), శిఖర్ ధవన్(7) లు వికెట్లను కోల్పోయి కాస్త తడబడింది. ఈ దశలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న కోహ్లి, అజింక్యా రహానేతో కలిసి మూడో వికెట్ కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహానే(45) తృటిలో హాఫ్ సెంచరీని కోయి మూడో వికెట్ గా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా ఆచితూచి ఆడుతూ కోహ్లికి సహకరించాడు. ఈ క్రమంలోనే రైనా (53;52 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఫామ్ లో కి వచ్చాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 127 రన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఓ దశలో 45ఓవర్లకు 270 పరుగులతో జోరుమీదున్న భారత్.. భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే స్లాగ్ ఓవర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లు రాణించడంతో టీమిండియా చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, రబడాలకు తలో మూడు వికెట్లు లభించగా, క్రిస్ మోరిస్ ఒక వికెట్ దక్కింది.
భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా తడబడింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు కుదేలైంది. 88 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడిన ఏబీ డివిలియర్స్(112, 107బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లు)తో ఒంటరి పోరాటం చేసి.. సఫారీలకు గెలుపుపై ఆశలు రేపాడు. జట్టు స్కోరు 233 వద్ద భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌన్సర్ తో ఏబీని పెవిలియన్ పంపడంతో.. భారత్ విజయం లాంఛనమైంది.
చివర్లో టెయిల్ ఎండర్స్ కాసేపు భారీ షాట్లు బాదినా.. సఫారీల ఛేజింగ్ టార్గెట్ కు సుదూరంగా ఆగిపోయింది. నిర్నీత 50 ఓవర్లు ముగిసే సరికి 9వికెట్ల నష్టానికి కేవలం 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా.. హర్బజన్ సింగ్ 2, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా తలా ఒక వికెట్ కూల్చారు.
అద్భుత సెంచరీతో టీమిండియాను ఆదుకున్న విరాట్ కొహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు లభించింది. కాగా.. ఈ సిరీస్ లో నిర్ణయాత్మక ఐదో వన్డే ఈనెల 25న ముంబాయి లో జరగనుంది.