హమ్మయ్య.. చివరికి ఒకటి గెలిచారు
మిర్పూర్: వరుసగా రెండు ఘోర పరాభవాలతో దిక్కుతోచని స్థితిలో పడిన భారత్... ఎట్టకేలకు విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ చిన్న జట్టే అయినా పెద్ద దెబ్బ కొట్టడంతో దాన్నుంచి తేరుకుని పరువు నిలబెట్టుకుంది. ఆఖరి వన్డేలో బరిలోకి దిగిన దోనిసేన చివరికి విజయాన్ని సాధించింది. 77 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ భారత్ జట్టులో ధావన్, ధోని అర్ధసెంచరీలకు రైనా మెరుపులు తోడవడంతో భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 318 పరుగుల టార్గెట్ ఉంచింది.
39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాను ధావన్, కోహ్లి ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 75 పరుగులు జోడించాక కోహ్లి(25) అవుటయ్యాడు. తర్వాత ధోనితో కలిసి ధావన్ ఇన్నింగ్స్ కు చక్కదిద్దాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ కొట్టిన ధావన్ 75 పరుగులు (73 బంతుల్లో 10 ఫోర్లు) చేసి అవుటయ్యారు. తర్వాత అంబటి రాయుడితో కలిసి ధోని ఇన్నింగ్స్ కు మరమ్మతు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 93 పరుగులు జోడించారు. అంబటి రాయుడు(44) అంపైర్ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 46.6 ఓవర్లకు 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.