భారత్ భారీ స్కోరు
మిర్పూర్: ధావన్, ధోని అర్ధసెంచరీలకు రైనా మెరుపులు తోడవడంతో బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 318 పరుగుల టార్గెట్ ఉంచింది.
39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాను ధావన్, కోహ్లి ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 75 పరుగులు జోడించాక కోహ్లి(25) అవుటయ్యాడు. తర్వాత ధోనితో కలిసి ధావన్ ఇన్నింగ్స్ కు చక్కదిద్దాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ కొట్టిన ధావన్ 75 పరుగులు (73 బంతుల్లో 10 ఫోర్లు) చేసి అవుటయ్యారు. తర్వాత అంబటి రాయుడితో కలిసి ధోని ఇన్నింగ్స్ కు మరమ్మతు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 93 పరుగులు జోడించారు. అంబటి రాయుడు(44) అంపైర్ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు.
ధోని 77 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 69 పరుగులు చేశాడు. రైనా క్రీజులోకి వచ్చిన వెంటనే బ్యాట్ ఝుళిపించాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఆరో వికెట్ గా అవుటయ్యాడు. రోహిత్ శర్మ 29, బిన్నీ 17, అక్షర్ పటేల్ 10 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో మొర్తజా 3 ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టారు. షకీబ్ కు ఒక వికెట్ దక్కింది.