‘పరీక్ష’ గెలిచారు
గ్రూప్ ‘2’ టాపర్‌గా నాకౌట్‌కు భారత్
ఆస్ట్రేలియాపై 73 పరుగులతో విజయం
యువరాజ్ అర్ధసెంచరీ
సమష్టిగా రాణించిన బౌలర్లు
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లు రాణించడంతో... సెమీస్ బెర్త్ ఖరారైనా, ఇప్పటిదాకా బ్యాట్స్‌మెన్ సత్తాకు ముఖ్యంగా మిడిలార్డర్‌కు పరీక్ష ఎదురుకాలేదు. దీంతో ఆస్ట్రేలియాతో ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయాలని ధోని నిర్ణయించుకున్నాడు. టాస్ ఓడిపోయినా... ధోని కోరుకున్నట్లే తొలుత బ్యాటింగ్ చేశారు. అసలు సిసలు పరీక్షగా భావించిన మ్యాచ్‌లో... పరిస్థితులకు తగ్గట్లుగా ఆడి పాసయ్యారు. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరి గిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (43 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చాలాకాలం తర్వాత నిలకడగా ఆడి అర్ధసెంచరీ చేశాడు. కోహ్లి (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్), రహానే (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. యువరాజ్, ధోని ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 84 పరుగులు జోడించడం ఇన్నింగ్స్‌కు హైలైట్. ఆస్ట్రేలియా బౌలర్లంతా తలా ఓ వికెట్ తీసుకున్నారు.
ఆస్ట్రేలియా జట్టు 16.2 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు) సహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా భారత బౌలర్లకు ఎదురు నిలువలేదు. ఏదో భారత ఫీల్డర్లకు క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయిస్తున్నట్లు అందరూ వరుసపెట్టి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌లు ఇచ్చారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా... మిశ్రా రెండు వికెట్లు సాధించాడు. భువనేశ్వర్, మోహిత్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
నిలబెట్టిన భాగస్వామ్యం
ఫామ్‌లో ఉన్న రోహిత్ తొలి ఓవర్లోనే వైదొలిగాడు. అయితే రహానే, కోహ్లి నిలకడగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.
మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్ తడబడటంతో పరుగులు మందగించడంతో పాటు వికెట్లు పడ్డాయి. 12వ ఓవర్‌కల్లా భారత్ రహానే, కోహ్లి, రైనాల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ధోని వచ్చే సమయానికే క్రీజులో కుదురుకున్న యువీ... కెప్టెన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టాడు. స్కోరు చకచకా కదులుతున్న సమయంలో ధోని, యువీ వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో 159 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చకచకా వికెట్లు
మంచి ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు... ఈ మ్యాచ్‌లోనూ కుదురుగా బౌలింగ్ చేశారు. ఆరంభంలోనే చకచకా వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 27 పరుగులు చేసింది.
ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా స్టార్ మ్యాక్స్‌వెల్ సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. కానీ అశ్విన్ క్యారమ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. వార్నర్, బెయిలీ కూడా భారీ షాట్లకు వెళ్లి అవుటయ్యారు. దీంతో ఆసీస్ 63 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ముర్హెడ్ (బి) హాడ్జ్ 5; రహానే (సి) హాడిన్ (బి) బొలింజర్ 19; కోహ్లి (సి) వైట్ (బి) ముర్హెడ్ 23; యువరాజ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వాట్సన్ 60; రైనా (సి) ఫించ్ (బి) మ్యాక్స్‌వెల్ 6; ధోని (బి) స్టార్క్ 24; జడేజా రనౌ ట్ 3; అశ్విన్ నాటౌట్ 2; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎ క్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159
వికెట్ల పతనం: 1-6; 2-46; 3-53; 4-66; 5-150; 6-152; 7-158.
బౌలింగ్: హాడ్జ్ 2-0-13-1; మ్యాక్స్‌వెల్ 4-0-20-1; స్టార్క్ 4-0-36-1; వాట్సన్ 4-0-36-1; బొలింజర్ 4-0-24-1; ముర్హెడ్ 2-0-24-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 6; వార్నర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 19; వైట్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 0; వాట్సన్ (బి) మోహిత్ 1; మ్యాక్స్‌వెల్ (బి) అశ్విన్ 23; బెయిలీ (సి) కోహ్లి (బి) జడేజా 8; హాడ్జ్ (సి) జడేజా (బి) మిశ్రా 13; హాడిన్ (సి) రహానే (బి) మిశ్రా 6; స్టార్క్ రనౌట్ 2; ముర్హెడ్ (సి) ధోని (బి) అశ్విన్ 3; బొలింజర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 86
వికెట్ల పతనం: 1-13; 2-19; 3-21; 4-44; 5-55; 6-63; 7-75; 8-79; 9-83; 10-86.
బౌలింగ్: భువనేశ్వర్ 3-0-7-1; మోహిత్ 2-0-11-1; అశ్విన్ 3.2-0-11-4; రైనా 1-0-16-0; జడేజా 4-0-25-1; అమిత్ మిశ్రా 3-0-13-2.