
జయంత్ యాదవ్ అరంగేట్రం
విశాఖ: న్యూజిలాండ్తో ఇక్కడ డా.వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్లో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గత మ్యాచ్లో గెలిచిన న్యూజిలాండ్ను ఎలాగైనా నిలువరించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ధోని సేన భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ నాల్గో వన్డేలో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. భారత జట్టులో తిరిగి జస్ర్పిత్ బూమ్రా తిరిగి జట్టులో చేరగా, ధవల్ కులకర్ణి రిజర్వ్ బెంచ్కు పరిమితమయ్యాడు. మరోవైపు హరియాణా ఆటగాడు జయంత్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దాంతో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ తుది జట్టులో కోరీ అండర్సన్ చేరాడు.
ఇప్పటివరకూ వైజాగ్లో భారత జట్టు ఐదు వన్డేలు ఆడింది. ఇందులో నాలుగింట విజయం సాధించిన టీమిండియా.. ఒకదాంట్లో మాత్రమే ఓటమి పాలైంది. 2005లో ఇక్కడ జరిగిన మొట్టమొదటి వన్డేలో పాకిస్తాన్పై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2010 ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. 2011లో వెస్టిండిస్పై ఐదు వికెట్లతో విజయం నమోదు చేసింది. కాగా, 2013లో నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విసిరిన 289 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, 2014లో అక్టోబర్లో విండీస్ తో జరగాల్సిన వన్డే మ్యాచ్ తుపాను కారణంగా రద్దయ్యింది.