ముంబై: వరల్డ్‌కప్‌కు వెళ్లబోయే జట్ల ఎంపికకు ఇంకా వారం సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే కొన్ని దేశాలు తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ కూడా తమ జట్టును ఎంపిక చేసింది. సోమవారం చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో అంబటి రాయుడు, రిషభ్ పంత్‌లకు నిరాశ ఎదురైతే.. విజయ్ శంకర్, కేదార్ జాదవ్‌లను అదృష్టం వరించింది. 2015 ప్రపంచకప్ జట్టుతో పోల్చితే.. ఏకంగా 8 మంది కొత్తవారికి సెలక్షన్ కమిటీ చోటు కల్పించడం విశేషం.
గత ప్రపంచకప్‌లో ఆడిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జడేజా, షమీలకు ఈ జట్టులో కూడా చోటు దక్కింది. ఇక గత ప్రపంచకప్‌కు ఎంపికై ఇప్పుడు చోటు కోల్పోయిన వారిలో రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్, రహానే, సురేశ్ రైనా,అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు ఉన్నారు. అయితే ఇక్కడ ఇషాంత్ శర్మ మోచేతి గాయం కారణంగా గత ప్రపంచకప్‌కు దూరమైతే అతని స్థానంలో మోహిత్ శర్మను ఎంపిక చేశారు. ప్రస్తుతం వీరి స్థానాల్లో కొత్తగా భారత వరల్డ్‌కప్ జట్టలో చోటు దక్కించుకున్న వారిలో విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తీక్, చహల్, బుమ్రాలు ఉన్నారు. మెగాటోర్నీలో ఆడే అవకాశం తొలిసారి రావడంతో వీరంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment