భారత కుర్రాళ్లకు టైటిల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సీనియర్ స్థాయిలోనే కాదు... జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ క్రికెట్‌లో భారత్ తిరుగులేని శక్తిగా మారుతోంది. అండర్-19 నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత కుర్రాళ్లు ఇదే నిరూపించారు. టోర్నీ అంతటా నిలకడగా రాణించడంతో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నారు. వైఎస్‌ఆర్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తుది పోరులో భారత్ అండర్-19 జట్టు ఏకంగా 201 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టును చిత్తుగా ఓడించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా కెప్టెన్ విజయ్ జోల్ (90 బంతుల్లో 71; 6 ఫోర్లు; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రికీ భుయ్ (53 బంతుల్లో 46; 3 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జత చేశాడు.
ఆ తర్వాత ముంబై చిచ్చర పిడుగు, 15 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ (58 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. జస్టిన్ డిల్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు భారత స్పిన్ ధాటికి చేతులెత్తేసింది. 28.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే ఆలౌటయింది. 13 పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు పడినప్పటి నుంచి ఆ జట్టు కోలుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
జేసన్ స్మిత్ (41 బంతుల్లో 23; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆమిర్ గనికి మూడు, కుల్‌దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో చెలరేగిన సర్ఫరాజ్ తన స్పిన్ బౌలింగ్‌తోనూ రెండు వికెట్లతో సత్తా చాటుకున్నాడు. మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ 41.3 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది.