under -19
-
క్రికెట్లో సంచలనం: తొమ్మిది మంది డకౌట్!
సాక్షి, గుంటూరు: దేశీయ క్రికెట్లో సంచలనం చోటు చేసుకుంది. తొలి బంతికే ఓ జట్టు విజయం సాధించింది. శుక్రవారం గుంటూరులోని జేకేసీ కాలేజీ మైదానంలో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ వన్డే లీగ్, నాకౌట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. నాగాలాండ్ జట్టుపై కేరళ టీమ్ మొదటి బంతికే విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లు ఆడి కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఒక పరుగు వెడ్ ద్వారా రావడం విశేషం. ఓపెనర్ మేనక 18 బంతులు ఆడి మరొక పరుగు సాధించింది. తొమ్మిది మంది డకౌటయ్యారు. కేరళ కెప్టెన్ మిన్ను మణి నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టింది. మూడు పరుగుల లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ టీమ్ తొలి బంతికే ఫోర్ కొట్టి సంచలన విజయం సాధించింది. తమ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల కేరళ కోచ్ సుమన్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. నాగాలాండ్ 40 పరుగుల వరకు చేస్తుందని అనుకున్నామని, కానీ ఊహించని విధంగా రెండు పరుగులకే కుప్పకూలిందన్నారు. ఈ ఘనత కెప్టెన్ మిన్ను, ఇతర క్రీడాకారిణులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. -
ఉత్తమ స్థాయికి తీసుకువెళ్లడమే నా బాధ్యత: ద్రవిడ్
కోల్‌కతా: ఆటగాళ్లను మరింతగా రాటుదేల్చి ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని అండర్-19 క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. కాగా జట్టు ఎంపికలో తన పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ‘ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం వరకే నా బాధ్యత. అంతేకానీ జట్టులోకి ఎవరు ఎంపిక కావాలనే దాంట్లో నా జోక్యం ఉండదు. ఎంపికైన వారి ఆటకు మెరుగులు దిద్ది మరో స్థాయికి తీసుకెళ్లేందుకు శాయశక్తులా కషి చేస్తా’ అని ద్రవిడ్ తెలిపారు. శుక్రవారం నుంచి భారత జట్టు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ అండర్-19 జట్లతో సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు బంగ్లాదేశ్‌లో జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. -
భారత కుర్రాళ్లకు టైటిల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సీనియర్ స్థాయిలోనే కాదు... జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ క్రికెట్లో భారత్ తిరుగులేని శక్తిగా మారుతోంది. అండర్-19 నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత కుర్రాళ్లు ఇదే నిరూపించారు. టోర్నీ అంతటా నిలకడగా రాణించడంతో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తుది పోరులో భారత్ అండర్-19 జట్టు ఏకంగా 201 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా కెప్టెన్ విజయ్ జోల్ (90 బంతుల్లో 71; 6 ఫోర్లు; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రికీ భుయ్ (53 బంతుల్లో 46; 3 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత ముంబై చిచ్చర పిడుగు, 15 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ (58 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. జస్టిన్ డిల్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు భారత స్పిన్ ధాటికి చేతులెత్తేసింది. 28.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే ఆలౌటయింది. 13 పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు పడినప్పటి నుంచి ఆ జట్టు కోలుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. జేసన్ స్మిత్ (41 బంతుల్లో 23; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆమిర్ గనికి మూడు, కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో చెలరేగిన సర్ఫరాజ్ తన స్పిన్ బౌలింగ్‌తోనూ రెండు వికెట్లతో సత్తా చాటుకున్నాడు. మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ 41.3 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది.