ఐదేళ్ల తర్వాత... | Indian couple in Chennai Open doubles title | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత...

Published Mon, Jan 9 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

ఐదేళ్ల తర్వాత...

ఐదేళ్ల తర్వాత...

చెన్నై ఓపెన్‌లో భారత జంటకు డబుల్స్‌ టైటిల్‌
విజేతగా నిలిచిన బోపన్న–జీవన్‌ జంట
 ఫైనల్లో పురవ్‌–దివిజ్‌ జోడీపై విజయం


చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో ఐదేళ్ల విరామం తర్వాత భారత జంట ఖాతాలో డబుల్స్‌ టైటిల్‌ చేరింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న తన భాగస్వామి జీవన్‌ నెడుంజెళియన్‌తో కలసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 65 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్‌ బోపన్న–జీవన్‌ ద్వయం 6–3, 6–4తో భారత్‌కే చెందిన పురవ్‌ రాజా–దివిజ్‌ శరణ్‌ జంటపై విజయం సాధించింది. 21 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి డబుల్స్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన రెండు జంటలు పోటీపడటం జరిగింది. విజేతగా నిలిచిన బోపన్న జంటకు 24,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 52 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. రన్నరప్‌ పురవ్‌–దివిజ్‌ ఖాతాలో 12,740 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 68 వేలు), 150 ర్యాంకింగ్‌ పాయింట్లు చేరాయి. గత ఏడాది ఒక్క టైటిల్‌ కూడా నెగ్గలేకపోయిన బోపన్న ఈ సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించాడు.

బోపన్న కెరీర్‌లో ఇది 15 టైటిల్‌కాగా... జీవన్‌కు మాత్రం తొలి టైటిల్‌. ఫైనల్‌ చేరుకునే క్రమంలో నిలకడగా ఆడిన దివిజ్‌–పురవ్‌ ద్వయం తుదిపోరులో మాత్రం తడబడింది. తన కెరీర్‌లో తొలి ఏటీపీ ఫైనల్‌ ఆడుతోన్న జీవన్‌ ఈ మ్యాచ్‌లో తన సర్వీస్‌లను నిలబెట్టుకోగా... మిగతా ముగ్గురు కనీసం ఒక్కసారైనా తమ సర్వీస్‌లను కోల్పోయారు. మ్యాచ్‌ మొత్తంలో బోపన్న జంట నాలుగుసార్లు ప్రత్యర్థి జంట సర్వీస్‌లను బ్రేక్‌ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకుంది.  

‘ఈ టోర్నీ డబుల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి రెండు జంటలు ఫైనల్‌కు చేరుకోవడం శుభపరిణామం. మా విజయం స్ఫూర్తితో మరింత మంది చిన్నారులు రాకెట్‌ పట్టి ఈ క్రీడలో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.2011లో లియాండర్‌ పేస్‌–మహేశ్‌ భూపతి జోడీ ఈ టైటిల్‌ సాధించాక మరో భారత జంట ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరలేదు. లియాండర్‌ పేస్‌ మాత్రం 2012లో టిప్సరెవిచ్‌ (సెర్బియా)తో జతగా టైటిల్‌ నెగ్గగా... రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)తో జోడీగా 2015లో రన్నరప్‌గా నిలిచాడు.

సింగిల్స్‌ విజేత అగుట్‌
అంతకుముందు జరిగిన పురుషుల సిం గిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ రొబెర్టో బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) విజేతగా నిలిచాడు. తుది పోరులో అగుట్‌ 6–3, 6–4తో అన్‌సీడెడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచాడు. 2013లో రన్నరప్‌గా నిలిచిన అగుట్‌ ఈసారి టైటిల్‌ సొంతం చేసుకోవడం విశేషం. విజేత అగుట్‌కు 79,780 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 37 వేలు) లభించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement