పేస్ జోడీపై బోపన్న జంట పైచేయి
దుబాయ్ ఓపెన్‌లో ఫైనల్లోకి
దుబాయ్: కొత్త ఏడాదిలోనూ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గత సంవత్సరం ఒక్క డబుల్స్ టోర్నీ టైటిల్ నెగ్గలేకపోయిన 43 ఏళ్ల పేస్... ఈ ఏడాది తాను పాల్గొన్న ఆరో టోర్నమెంట్‌లోనూ ఫైనల్‌కు చేరలేకపోయాడు. స్పెయిన్‌కు చెందిన గిలెర్మో గార్సియా లోపెజ్‌తో జతగా దుబాయ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన పేస్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ఆటగాడు, 36 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలాండ్)తో కలిసి పేస్–లోపెజ్ జంటపై విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో బోపన్న–మట్కోవ్‌స్కీ ద్వయం 6–3, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో పేస్–లోపెజ్ జోడీని ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న–మట్కోవ్‌స్కీ జోడీ 2–4తో వెనుకబడ్డా ఆ వెంటనే తేరుకొని తుదకు 10–6తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా); జులియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో బోపన్న ద్వయం తలపడుతుంది.