ఎందరో మహానుభావులు...అందరికీ ఐదు వందనాలు
టెస్టు క్రికెట్‌లోకి భారత్ అడుగు పెట్టిన తర్వాత 499 మ్యాచ్‌లు ఆడితే... వీటిలో 285 మంది ఆటగాళ్లు మన జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎందరో గొప్ప ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఐదు రోజుల ఆటకు వన్నెలద్దారు. తొలి తరంలో క్రికెట్ మజాను ప్రపంచానికి చూపించి ఆటను నిలబెట్టిన వారు కొందరైతే... టెస్టు మ్యాచ్‌లనే శ్వాసించిన మలి తరంలో మరికొందరు దేశం గర్వపడేలా చేశారు. ఆ తర్వాత పరిమిత ఓవర్ల హోరులో కొట్టుకుపోతున్న తరంలో సంప్రదాయ క్రికెట్‌ను కూడా చూడాలనిపించేలా చేసిన ఘనత మరికొందరిది. వారి అద్భుత ఆటకు వేలాది పరుగులు, వికెట్లు దాసోహమంటే, విజయాలు వెతుక్కుంటూ వచ్చి ఒళ్లో వాలాయి. పడగొట్టిన గణాంకాలు, కుప్పకూలిన రికార్డులకై తే లెక్కే లేదు. మన జట్టు 500వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న తరుణంలో భారత క్రికెట్ కీర్తిని పెంచిన దిగ్గజాలలో కొందరిని గుర్తు చేసుకుందాం.
సచిన్ టెండూల్కర్
200 టెస్టుల్లో 15,921 పరుగులు, 51 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్‌కు సాటి మరెవరూ లేరు. దాదాపు పాతికేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన సచిన్ తన ఆటతో రికార్డుల మోత మోగించాడు. పరిపూర్ణమైన బ్యాట్స్‌మన్‌గానే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆరాధ్య క్రికెటర్‌గా కూడా టెండూల్కర్‌కు దక్కిన గుర్తింపు ముందు మరేదీ సాటి రాదు. ఒకటా, రెండా ఎన్నెన్ని ఘనతలు... తొలి మ్యాచ్‌నుంచి చివరి టెస్టు వరకు ప్రతీ అడుగు, ప్రతీ పరుగు సంచలనమే. భారత జాతి ఆశల భారం మొత్తం మోస్తూ అతను సాధించిన సుదీర్ఘ ప్రయాణం అసమానం. ఒక తరం అభిమానులందరికీ సచిన్ ఆటతోనే క్రికెట్ ప్రపంచం ప్రారంభమై సచిన్‌తోనే ముగిసిందంటే అతిశయోక్తి కాదు.
లాలా అమర్‌నాథ్
తొలి తరంలో భారత క్రికెట్‌కు గుర్తింపు తెచ్చిన ఆటగాళ్లలో అమర్‌నాథ్ ఒకడు. భారత్ తరఫున తొలి సెంచరీ సాధించిన ఘనత అతనిదే. ఆటగాడిగా 24 టెస్టుల రికార్డు గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ నాటితరంలో జట్టుకు మార్గనిర్దేశనం చేసిన వ్యక్తిగా అతను తనదైన ముద్ర వేశాడు. ఆ రోజుల్లోనే క్రికెట్‌లో అతిగా జోక్యం చేసుకుంటున్న స్థానిక రాజులపై ఒక రకమైన తిరుగుబాటు చేసిన లాలా అందుకు తన కెరీర్‌నే పణంగా పెట్టాడు. బ్రాడ్‌మన్ చేత ‘క్రికెట్‌కు అసలైన రాయబారి’గా ప్రశంసలు అందుకున్నాడు.
మొహమ్మద్ అజహరుద్దీన్
టెస్టు క్రికెట్‌లోకి వరుసగా మూడు సెంచరీలతో అడుగు పెట్టిన అజహర్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అతని కెరీర్ అత్యుత్తమ దశలో మణికట్టు మాయాజాలం ప్రదర్శిస్తూ సాధించిన పరుగులు ఎవరూ మరచిపోలేరు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై చేసిన 121 పరుగుల ఇన్నింగ్‌స ఇప్పటికీ ’ది బెస్ట్’లో ఒకటి. దక్షిణాఫ్రికాపై కేప్‌టౌన్ టెస్టులో 110 బంతుల్లో చేసిన 115 పరుగులు కూడా చిరకాలం గుర్తుండిపోతాయి. టెస్టుల్లో చేసిన 22 సెంచరీలు అతడిని భారత్ టాప్-5 జాబితాలో నిలబెట్టాయి. 47 టెస్టులకు నాయకత్వం వహించి విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా అజహర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
సెహ్వాగ్
సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు, ఆల్‌రౌండర్‌గా వినూ మన్కడ్ ప్రదర్శన, ప్రత్యర్థులను వణికించిన స్పిన్ చతుష్టయం, నాయకులుగా గొప్ప రికార్డులు సాధించిన గంగూలీ, ధోని, అనేక సందర్భాల్లో కీలక విజయాలు అందించిన జహీర్, హర్భజన్... ఇలా మరెంతో మంది తమ ఆటతో భారత టెస్టు క్రికెట్‌ను పరిపూర్ణం చేశారు. 84 ఏళ్ల మన టెస్టు చరిత్రలో ప్రతీ భారత అభిమాని గర్వపడేలా చేసిన అందరికీ ఐదు వందల వందనాలు.
వీవీఎస్ లక్షణ్
ఒక్క మ్యాచ్ చాలు... వేల పరుగుల రికార్డులను వెనక్కి తోసేందుకు, ఒక్క మ్యాచ్ చాలు... జీవితకాలానికి సరిపడా కీర్తిని అందుకునేందుకు! 2001 కోల్‌కతా టెస్టులో అత్యద్భుత రీతిలో చేసిన 281 పరుగుల ఇన్నింగ్‌స లక్షణ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. స్ట్రోక్‌ప్లేలో కొన్ని సార్లు సచిన్‌నే మరిపించేలా అతని మణికట్టు మాయాజాలం సాగింది. ఆన్‌సైడ్‌లో అతను ఆడే చూడముచ్చటైన షాట్లు టెస్టు క్రికెట్‌లో మజాను చూపించాయి. ఎవరిని చూసి ప్రపంచ క్రికెట్ భయపడేదో అదే ఆస్ట్రేలియా జట్టు గుండెల్లో కంగారు పుట్టించిన ఘనత అతనిది. 2003 సిరీస్‌లో తమ దేశంలోనే చెలరేగిపోయిన వీవీఎస్‌కు ఎక్కడ బంతి వేయాలో తెలీక ఆసీస్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. 134 టెస్టుల్లో వీవీఎస్ 8781 పరుగులు చేశాడు.
రాహుల్ ద్రవిడ్
ద్రవిడ్‌లాంటి ఆటగాడిని చూడటం టెస్టు క్రికెట్ చేసుకున్న అదృష్టం అనే వ్యాఖ్య ’ది వాల్’కు సరిగ్గా సరిపోతుంది. కళాత్మక టెస్టు క్రికెటర్ల జాబితాలో ఆఖరి వ్యక్తి బహుశా అతనే కావచ్చు. ఒక్క సారి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడంటే ద్రవిడ్‌ను ఆపడం ఏ బౌలర్ తరమూ కాదు. టెస్టుల్లో 30 వేలకు పైగా (31, 258) బంతులు ఎదుర్కొన్న ఏకై క బ్యాట్స్‌మన్ ద్రవిడ్ ఏకాగ్రత, పట్టుదల అసాధారణం. జట్టును గెలిపించే ఇన్నింగ్‌సను నిర్మించాలన్నా, కష్టాల్లో ఉన్నప్పుడు తన డిఫెన్‌సతో ప్రత్యర్థిని అడ్డుకోవాలన్నా ద్రవిడ్‌కే సాధ్యం. 2003 అడిలైడ్ టెస్టు ఇన్నింగ్‌స అతని అద్భుతాలలో ఒకటి కాగా... పాక్‌పై చేసిన 270 పరుగుల కోసం 12 గంటల పాటు క్రీజ్‌లో నిలిచిన వైనం చిరస్మరణీయం.
గుండప్ప విశ్వనాథ్
70వ దశకంలో అత్యంత కళాత్మక బ్యాట్స్‌మన్‌గా విశ్వనాథ్ తన సత్తాను చాటాడు. భారత జట్టు సాధించిన విజయాల్లో సన్నీతో కలిసి అతను కీలక పాత్ర పోషించాడు. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోగలిగిన కొద్ది మంది భారత బ్యాట్స్‌మెన్‌లో అతను ఒకడు. వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెరుున్‌లో, ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో చేసిన సెంచరీలు విశ్వనాథ్ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచాయి. 91 టెస్టుల కెరీర్‌లో గుండప్ప 41.93 సగటుతో 6080 పరుగులు సాధించాడు.
విజయ్ హజారే
భారత్ జట్టు తొలి ఆస్ట్రేలియా పర్యటన (1947-48)లో అద్భుత బ్యాటింగ్ విజయ్ హజారే విలువను ప్రపంచానికి చూపించాయి. అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్‌సలలో అతను చేసిన సెంచరీలకు కంగారూలు కూడా ఫిదా అయిపోయారు. 30 టెస్టులు ఆడిన హజారే స్వాతంత్య్రానంతరం భారత క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచాడు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా చాలా కాలం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోవడం హజారే కెరీర్‌పై ప్రభావం చూపించింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో భారీ స్కోర్లతో సుదీర్ఘ కాలం అతను అభిమానులను అలరించాడు.
అనిల్ కుంబ్లే
భారత జట్టుకు బౌలర్‌గా అందరికంటే ఎక్కువ విజయాలు అందించిన రికార్డు కుంబ్లే సొంతం. 90ల్లో సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శన కనబర్చిన కుంబ్లే... కొత్త శతాబ్దంలో విదేశీ వేదికలు హెడింగ్లీ, అడిలైడ్, ముల్తాన్, కింగ్‌స్టన్‌లలో టీమిండియా సాధించిన చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 300 వికెట్లు పడగొట్టిన తొలి భారత స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంబో... ఆ తర్వాత 600 వికెట్ల మార్క్‌తో శిఖరాన నిలిచాడు. అన్నింటికి మించి 1999 ఢిల్లీ టెస్టులో పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్‌సలో 10 వికెట్లు తీసిన అరుదైన ఘనత భారత క్రికెట్‌కే హైలైట్.
సునీల్ గావస్కర్
టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్, బ్రాడ్‌మన్‌ను దాటి 30 సెంచరీల రికార్డుతో పాటు... గణాంకాలపరంగా గావస్కర్ గొప్పతనాన్ని చెప్పేవి చాలా ఉన్నాయి. కానీ ఇదొక్కటే కాదు, నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్నా పెద్దగా పట్టించుకోని సమయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్‌కు గౌరవం తెచ్చిన వ్యక్తి అతను. మన జట్టూ గెలవగలదని నమ్మకం పెంచిన క్రికెటర్. తొలి సిరీస్‌లోనే విండీస్ విధ్వంసకర బౌలర్లను ఎదుర్కొని పరుగుల ప్రవాహం పారించిన సన్నీ... అద్భుతమైన టెక్నిక్, దుర్భేద్యమైన డిఫెన్‌సతో 70, 80 వ దశకాల్లో బ్యాట్స్‌మన్‌గా ఆటను శాసించాడు. హెల్మెట్ లేకుండానే ఆ కాలంలో గావస్కర్ కొట్టిన హుక్, పుల్ షాట్‌లకు క్రికెట్ ప్రపంచం తలవంచింది. టెస్టు చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్ల జాబితాలో కచ్చితంగా చేర్చాల్సిన పేరు గావస్కర్.
కపిల్‌దేవ్
భారత్ అందించిన తొలి, అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా కపిల్‌దేవ్ చరిత్రలో నిలిచిపోయాడు. అతని అవుట్ స్వింగర్లు జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాయి. కొత్త మిలీనియం సమయంలో సన్నీ, సచిన్‌లను దాటి ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ అంటూదేశ ప్రజలు కపిల్‌కే పట్టం కట్టారు. మరో ఎండ్‌లో చెప్పుకోదగ్గ పేసర్ లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఒంటరి పోరాటం చేసిన కపిల్, 434 వికెట్లతో హ్యాడ్లీ ప్రపంచ రికార్డును అధిగమించిన క్షణం మరచిపోలేనిది. తాను ఆడిన కాలంలో అత్యుత్తమ జట్టుగా ఉన్న వెస్టిండీస్‌పైనే 25 టెస్టుల్లోనే 24.89 సగటుతో 89 వికెట్లు తీయడం అతని ఘనతకు నిదర్శనం. గ్రేట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా మన్ననలందుకున్న కపిల్... తన బ్యాటింగ్‌తో కూడా ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఐదు సెంచరీలు చేసిన కపిల్ ఇన్నింగ్‌సలలో 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో 95 బంతుల్లోనే చేసిన సెంచరీ అత్యుత్తమం.