148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రకన్, జేడెన్ సీల్స్ వరుసగా 19, 31 (నాటౌట్), జేడెన్ సీల్స్ 22 పరుగులు చేశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వీరికి మించి ఎవరూ స్కోర్ చేయలేదు.
టాప్-8 బ్యాటర్స్‌లో అత్యధిక స్కోర్ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, ఎనిమిదో నంబర్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్ (137) దాటించారు.
ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విండీస్ పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్ బౌలర్లు బ్యాట్‌తో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్‌లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్ వార్రకన్ (31 నాటౌట్), జేడెన్ సీల్స్ 22) టాప్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.
మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది.
వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్ గడ్డపై అతి పొట్టి టెస్ట్ మ్యాచ్‌గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోముగిసింది.
ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment