ముంబై: భారత యువ సంచలనం పృథ్వీ షా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని సోమవారం కలిశాడు. మర్యాదపూర్వకంగా సచిన్‌ను ఆయన నివాసంలో కలిసిన పృథ్వీషా ఏకాంతంగా కాసేపు ముచ‍్చటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సచిన్‌ను కలిసిన ఫొటోను పృథ్వీషా పోస్ట్ చేశాడు. ఇటీవల రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టుతో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. ఆ మ్యాచ్‌లో 134 పరుగులతో ఆకట్టుకున్నాడు. దాంతో పృథ్వీ షా ఆట, దూకుడు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ని గుర్తుకు తెస్తున్నాయంటూ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఈ పోలికల్ని పట్టించుకోని పృథ్వీ షా రెండో టెస్టులోనూ (70, 33 నాటౌట్) సత్తాచాటి.. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీ సెమీస్‌లోనూ హైదరాబాద్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి ముంబై జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. వెస్టిండీస్‌పై రెండు టెస్టుల సిరీస్‌లో మొత్తం 203 పరుగులు చేసిన పృథ్వీ షాకి వన్డే సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. అయితే ఇప్పటికే తొలి రెండు వన్డేల కోసం జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. మిగిలిన మూడు వన్డేల కోసం త్వరలోనే జట్టుని ప్రకటించనున్నారు. ఈ జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ లేదా శిఖర్ ధావన్‌కి విశ్రాంతినిచ్చి.. పృథ్వీ షాకి చోటివ్వాలని భావిస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment