ఆడితే ఆరాధిస్తాం! | indian fans about ab deviellers | Sakshi
Sakshi News home page

ఆడితే ఆరాధిస్తాం!

Published Thu, Dec 10 2015 2:13 AM | Last Updated on Fri, May 25 2018 2:34 PM

ఆడితే ఆరాధిస్తాం! - Sakshi

ఆడితే ఆరాధిస్తాం!

- భారత్‌లో డివిలియర్స్‌కు అడుగడుగునా బ్రహ్మరథం
- గతంలో ఏ విదేశీ క్రికెటర్‌కూ లేని ఆదరణ


ఏ దేశంలో ఏ మైదానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నా ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారంటే... ఆ బ్యాట్స్‌మన్ పేరు సచిన్ టెండూల్కర్.
రెండేళ్ల క్రితం వరకూ పరిస్థితి ఇది. ఇప్పుడు సరిగ్గా ఆ స్థాయి గౌరవం అందుకుంటున్న క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ క్రీజులోకి వస్తుంటే భారత్‌లోని ప్రతి వేదికా హోరెత్తింది. గతంలో ఏ విదేశీ క్రికెటర్‌కూ ఈ స్థాయిలో ఇక్కడ ఆదరణ లభించలేదు.
 
 సాక్షి క్రీడావిభాగం
 భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టుకు తొలి రోజు ఊహించని స్థాయిలో ప్రేక్షకులు వచ్చారు. టెస్టుకు ఇంత ఆదరణా అంటూ నిర్వాహకులు పొంగిపోయారు. కొద్దిసేపటి తర్వాతగానీ దీనికి కారణం తెలియలేదు. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌కు వస్తుంటే స్టేడియం హోరెత్తింది. భారత క్రికెటర్లకు మించిన స్థాయిలో స్వాగతం పలికారు. ఎందుకంటే... అది అతని వందో టెస్టు. ప్రేక్షకుల స్పందన దక్షిణాఫ్రికా క్రికెటర్లతో పాటు భారత క్రికెట్ వర్గాల్లోనూ ఆశ్చర్యం పెంచింది. ఐపీఎల్‌లో డివిలియర్స్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఆ స్థాయిలో ఆదరణ వచ్చిందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాగ్‌పూర్‌లో, ఢిల్లీలోనూ అంతే. ముఖ్యంగా ఢిల్లీలో స్కూల్ పిల్లల హాజరు ఎక్కువగా ఉన్నందున డివిలియర్స్ బ్యాటింగ్‌కు వస్తున్నపుడు సందడి బాగా పెరిగింది. అంటే పిల్లల్లో కూడా డివిలియర్స్‌కు ఏ స్థాయిలో ఆదరణ ఉందో ఢిల్లీ టెస్టు ద్వారా అందరికీ అర్థమైంది.
 
 వైవిధ్యమే కారణం
 డివిలియర్స్ కంటే గొప్ప విదేశీ క్రికెటర్లు, దిగ్గజాలు గతంలోనూ భారత్‌లో ఆడారు. కానీ వాళ్లెవరికీ లభించని ఆదరణ ఏబీకే ఎందుకు దక్కింది? దీనికి ప్రధాన కారణం అతని వైవిధ్యభరిత ఆటతీరు. అతను క్రీజులో ఉన్నంతసేపు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని, ఆనందాన్ని పంచుతాడు. ఏ షాట్ ఎటు ఆడతాడో తెలియదు. బంతి ఎక్కడ వేయాలో తెలియక బౌలర్ తలపట్టుకుంటే... ప్రేక్షకుడు మాత్రం సంతోషంతో గంతులు వేస్తుంటాడు. పైగా డివిలియర్స్ ఆడేవి మొద్దు షాట్లు, అడ్డబాదుడు కాదు... ఎలాంటి షాట్ ఆడినా అందులో కళ ఉంటుంది. ఈ వైవిధ్యమే ప్రస్తుత తరం క్రికెటర్లలో అతణ్ని భిన్న ఆటగాడిని చేసింది. దీనికి తోడు ఐపీఎల్ రూపంలో అతను భారత ప్రేక్షకులకు బాగా సుపరిచితుడయ్యాడు.
 
 ఎనీ బాల్ డిఫెన్స్!
 డివిలియర్స్ అంటే ఇంతకాలం మెరుపు వేగం అని మాత్రమే భారత అభిమానులకు తెలుసు. గతంలో అతను టెస్టుల్లో చాలాసార్లు నెమ్మదిగా ఆడినా వాటిని ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. తాజాగా ఢిల్లీ టెస్టులో అతను ఆడిన తీరు మనవాళ్లకు చాలా కొత్తగా అనిపించి ఉంటుంది. అక్టోబరు 25న ముంబైలో భారత్‌తో జరిగిన చివరి వన్డేలో 61 బంతుల్లో 119 పరుగులు చేసి... అందులో 11 సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. నెల రోజుల తర్వాత భారత్‌తో ఆఖరి టెస్టులో ఏకంగా 297 బంతులు ఆడి 43 పరుగులే చేశాడు. విధ్వంసమే కాదు... డిఫెన్స్ కూడా బాగా ఆడగల నైపుణ్యం తనలో ఉందని చూపించాడు. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్ ఎంత బాగా ఆడాడంటే... ఏబీడీ అంటే ఎనీ బాల్ డిఫెన్స్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు. ఏమైనా ఈ తరం సూపర్ స్టార్ డివిలియర్స్ అని మరోసారి రుజువైంది.
 
 దేశంతో సంబంధం లేదు
 క్రికెట్ విషయంలో ఉపఖండం ప్రేక్షకులకు, బయటి దేశాల ప్రేక్షకులకు బాగా తేడా ఉంటుంది. బాగా ఆడితే ఏ దేశపు క్రికెటర్‌నైనా వారు అభినందిస్తారు. కానీ ఉపఖండంలో మాత్రం తమ దేశ ఆటగాళ్లకు మాత్రమే బ్రహ్మరథం పడుతుంటారు. ఒక్క సచిన్ విషయంలోనే గతంలో ఇది దేశాలకు అతీతంగా సాగింది. కానీ ఇప్పుడు డివిలియర్స్‌కు కూడా అన్ని దేశాల్లో అభిమానులు పెరిగారు. బాగా ఆడితే ఏ దేశ క్రికెటర్‌నైనా ఆరాధిస్తామని భారత ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌తో ప్రపంచానికి చాటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement