
ఆగస్టు 15న కడుపులు మాడాయి...
రియో డి జనీరో: పంద్రాగస్టు సంబరాల సంగతేమో కానీ రియోలో భారత హాకీ క్రీడాకారులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి భారత దౌత్య కార్యాలయంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అథ్లెట్లను ఆహ్వానించారు. హాకీ క్రీడ ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వెళ్లారు. అక్కడ ఎలాగూ విందు ఏర్పాటు చేస్తారని, పసందైన భారత వంటకాల రుచి చూడవచ్చనే కోరికతో ఒలింపిక్ విలేజిలో తమ డిన్నర్‌ను రద్దు చేసుకున్నారు.
అయితే కార్యక్రమంలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. వేడుక ముగిశాక కూల్ డ్రింక్స్, కాసిన్ని పల్లి గింజలు పెట్టేసరికి అంతా అవాక్కయ్యారు. దీంతో మాంచి ఆకలి మీదున్న ఆటగాళ్లు అధికారుల తీరుతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. రెండు బస్సులు మారి ఇంత దూరం వస్తే కనీసం భోజనాలు కూడా పెట్టకపోవడం దారుణమని ఓ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.