సందీప్ సింగ్‌కు నిరాశ
యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ హాకీ టోర్నీకి ముందు సన్నాహకంగా భారత జట్టు యూరప్‌లో ఆడే మ్యాచ్‌ల కోసం సీనియర్ ఆటగాళ్లు గుర్బాజ్ సింగ్, డానిష్ ముజ్తబాలకు పిలుపు అందింది. మరోవైపు హెచ్‌ఐఎల్‌లో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచిన ‘డ్రాగ్ ఫ్లికర్’ సందీప్ సింగ్‌కు మొండిచేయి ఎదురైంది. 21 మందితో కూడిన బృందం ఈ పర్యటనకు వెళ్లనుంది. ఈనెల 9 నుంచి 19 వరకు ది హేగ్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.
సర్దార్ సింగ్ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం గుర్బాజ్ జట్టు తరఫున బరిలోకి దిగలేదు. ఈ ఏడాది హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) రెండో సీజన్ విజేత ఢిల్లీ వేవ్‌రైడర్స్ తరఫున ఆడిన తను అద్భుత ఆటతీరుతో అదరగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక కుడి మోకాలుకు గాయం కారణంగా గత పది నెలలుగా ఆటకు దూరంగా ఉన్న మిడ్‌ఫీల్డర్ డానిష్ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నాడు. జనవరిలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో ఆడని ఫార్వర్డ్స్ రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు.