world cup tournment
-
పసిడితో ముగించారు
సిడ్నీ: ఈ నెలారంభంలో సీనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు ఓవరాల్ టీమ్ టైటిల్ నెగ్గగా... అదే జోరును జూనియర్ ప్రపంచకప్‌లోనూ కొనసాగించారు. సిడ్నీలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్ తొమ్మిది స్వర్ణాలతో రెండో ర్యాంక్‌లో నిలిచింది. చివరి రోజు భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల ముస్కాన్ గురికి భారత్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఫైనల్లో ముస్కాన్ 35 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ (18 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముస్కాన్, మను భాకర్, దేవాన్షి రాణా బృందానికి పసిడి పతకం లభించగా... అరుణిమా, మహిమా, తనూ రావల్ జట్టుకు రజతం దక్కింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, ఆయూష్ రుద్రరాజు, గుర్నీలాల్ జట్టు 348 పాయింట్లు సాధించి రజతం గెల్చుకుంది. ఓవరాల్‌గా భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలు గెలిచింది. చైనా తొమ్మిది స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 25 పతకాలు సొంతం చేసుకుంది. -
సందీప్ సింగ్‌కు నిరాశ
యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు న్యూఢిల్లీ: ప్రపంచకప్ హాకీ టోర్నీకి ముందు సన్నాహకంగా భారత జట్టు యూరప్‌లో ఆడే మ్యాచ్‌ల కోసం సీనియర్ ఆటగాళ్లు గుర్బాజ్ సింగ్, డానిష్ ముజ్తబాలకు పిలుపు అందింది. మరోవైపు హెచ్ఐఎల్లో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచిన ‘డ్రాగ్ ఫ్లికర్’ సందీప్ సింగ్‌కు మొండిచేయి ఎదురైంది. 21 మందితో కూడిన బృందం ఈ పర్యటనకు వెళ్లనుంది. ఈనెల 9 నుంచి 19 వరకు ది హేగ్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. సర్దార్ సింగ్ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం గుర్బాజ్ జట్టు తరఫున బరిలోకి దిగలేదు. ఈ ఏడాది హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) రెండో సీజన్ విజేత ఢిల్లీ వేవ్‌రైడర్స్ తరఫున ఆడిన తను అద్భుత ఆటతీరుతో అదరగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక కుడి మోకాలుకు గాయం కారణంగా గత పది నెలలుగా ఆటకు దూరంగా ఉన్న మిడ్‌ఫీల్డర్ డానిష్ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నాడు. జనవరిలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో ఆడని ఫార్వర్డ్స్ రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. -
యూఏఈ జట్టులో హైదరాబాదీ!
అండర్-19 వరల్డ్‌కప్‌లో రాణించిన ఉమర్ సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్థాయి క్రికెట్లో నగరానికి చెందిన కుర్రాడు ఉమర్ మొహమ్మద్ ఆకట్టుకున్నాడు. అయితే అతను ఆడింది భారత జట్టు తరఫున కాదు. ఈ టోర్నీలో ఉమర్... యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కుడి చేతి వాటం పేస్ బౌలర్ అయిన ఉమర్ స్వస్థలం హైదరాబాదే. నగరంలోని సన్‌సిటీ (లంగర్‌హౌస్) వద్ద గల బీకే క్రికెట్ అకాడమీలో అతను శిక్షణ పొందాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం అతను దుబాయ్‌లోనే ఉంటున్నాడు. తరచుగా నగరానికి వచ్చే ఉమర్, ఇదే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాడు. వరల్డ్ కప్ టోర్నీకి ముందు కూడా ఇక్కడే సాధన కొనసాగించాడు. అత్యుత్తమ బౌలింగ్...: తాజాగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో ఉమర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పొదుపైన బౌలింగ్ చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో (10-2-24-4) చెలరేగాడు. తమ అకాడమీ ఆటగాడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల బీకే అకాడమీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. -
భాటియాకు చోటు
న్యూఢిల్లీ: మార్చిలో జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. 30 మందితో కూడిన ఈ జాబితాలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ చోటు దక్కించుకోగా.... ఓపెనర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు నిరాశే ఎదురైంది. అయితే ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల ఆల్‌రౌండర్ రజత్ భాటియా పేరు కూడా ఇందులో ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన భాటియా 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5089 పరుగులు, 107 వికెట్లు తీశాడు. హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడుకు చోటు దక్కింది. జాబితాలో ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్, చతేశ్వర్ పుజారాలకు స్థానం దక్కలేదు. గత ఐపీఎల్లో ఆటగాళ్లు చూపిన ప్రతిభను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇదిలావుండగా మహిళల క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌లో ఎలాంటి సంచలనాలకు తావీయలేదు. భారత జట్టు ప్రాబుబల్స్: ధోని, కోహ్లి, ధావన్, రోహిత్ శర్మ, రైనా, రహానే, రాయుడు, దినేష్ కార్తీక్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, షమీ, ఇషాంత్, వినయ్ కుమార్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, రజత్ భాటియా, సంజూ శామ్సన్, ఈశ్వర్ పాండే, ఉమేశ్ యాదవ్, ఉన్ముక్త్ చంద్, మన్దీప్ సింగ్, హర ్భజన్ సింగ్, వరణ్ ఆరోన్, నదీమ్, పార్థీవ్ పటేల్, కరణ్ శర్మ. -
భారత్‌లో అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఫుట్‌బాల్‌కు సంబంధించి ఓ మెగా ఈవెంట్ భారత్‌లో జరగనుంది. 2017లో జరిగే అండర్-17 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) సాకర్ టోర్నమెంట్‌ను నిర్వహించే భాగ్యం పొందడం భారత్‌కు ఇదే తొలిసారి. బ్రెజిల్లో గురువారం జరిగిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 24 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్‌లను న్యూఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబై, చెన్నై, గువాహటి, మార్గోవా, కొచ్చి, బెంగళూరు నగరాల్లో నిర్వహిస్తారు. బిడ్డింగ్‌లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉజ్బెకిస్థాన్‌లు పోటీపడగా భారత్ ఈ మూడు దేశాల్ని అధిగమించి ఆతిథ్య అవకాశాన్ని పొందింది. గతంలో భారత్ ఆసియా అండర్-20 ఫెడరేషన్ కప్ (2006), ఏఎఫ్సీ చాలెంజ్ కప్ (2008)లను నిర్వహించినప్పటికీ ఫిఫా కప్‌కు మాత్రం ఎప్పుడూ ఆతిథ్యమివ్వలేదు. తొలుత ప్రభుత్వ గ్యారంటీ, పన్ను మినహాయింపుల నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో జనవరిలో దాఖలు చేసిన ప్రాథమిక బిడ్ తిరస్కరణకు గురైంది. తదనంతరం భారత ప్రభుత్వం నుంచి కూడా మద్దతు లభించడంతో గత నవంబర్‌లో బిడ్ దాఖలు చేశారు. దీంతో పాటు ‘ఫిఫా’ అండదండలు లభించడంతో బిడ్డింగ్‌లో భారత్ నెగ్గగలిగింది. ఈ టోర్నీతో భారత్‌లోనూ ఫుట్‌బాల్ క్రీడకు ప్రాచుర్యం పెరుగుతుందని ‘ఫిఫా’ అధ్యక్షుడు బ్లాటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రపంచకప్‌కు భారత హాకీ జట్టు అర్హత
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి భారత పురుషుల హాకీ జట్టు అర్హత సాధించింది. ఈమేరకు ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధికారికంగా ప్రకటన చేసింది. మే 31 నుంచి జూన్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆసియా చాంపియన్స్‌ట్రోఫీలో రెండో ఓటమి న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జూనియర్ ఆటగాళ్లతో ఆడుతున్న జట్టుకు ఈ ట్రోఫీలో రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ చేతిలో భారత్ 1-2 తేడాతో ఓడింది. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్ 12వ నిమిషంలో గోల్ చేశాడు. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లోనూ భారత జట్టు 0-2 తేడాతో చైనా చేతిలో ఓడింది. వచ్చే నెలలో జరిగే జూనియర్ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులోని 18 మంది ఆటగాళ్లలో 15 మంది జూనియర్స్‌ను ఎంపిక చేశారు. మహిళల హాకీ జట్టు విజయం పూనమ్ రాణి రెండు గోల్స్‌తో రాణించడంతో ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. తమకన్నా మెరుగైన ర్యాంకింగ్‌లో ఉన్న చైనాను 4-2తో కంగుతినిపించింది. భారత్ తరఫున రాణి (8వ ని, 59వ .), అమన్‌దీప్ కౌర్ (13వ ని.), వందన (61వ ని.) గోల్స్ చేశారు. -
ఆసియాకప్ ఫైనల్లో భారత్
ఇపో: అన్నీ కలసిరావడంతో భారత హాకీ జట్టు ఒకేసారి రెండు లక్ష్యాలను అందుకుంది. అటు ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించడంతోపాటు ఇటు ఆసియా కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో భారత్ 2-0 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించగా... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 2-1తో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. కొరియా జట్టు ఇప్పటికే ప్రపంచ కప్‌కు అర్హత పొందడం... అడ్డుగా ఉన్న పాకిస్థాన్ సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో భారత్, మలేసియా జట్లకు మార్గం సుగమమైంది. ఈ రెండు జట్లూ వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. 1971లో ప్రపంచ కప్ మొదలయ్యాక తొలిసారి పాకిస్థాన్ జట్టు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నిబంధనల ప్రకారం ఆసియా కప్ విజేత జట్టు గనుక ఇంతకుముందే ప్రపంచ కప్ బెర్త్ దక్కించుకుంటే... ఈ మెగా టోర్నీకి అర్హత టోర్నీగా గత జూన్, జూలైలలో నిర్వహించిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ రౌండ్లో ఆసియా జోన్ నుంచి అత్యుత్తమ స్థానాలు పొందిన రెండు జట్లకు అవకాశం లభిస్తుంది. ఈ నిబంధన ప్రకారం ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన కొరియాకు ఇప్పటికే ప్రపంచ కప్ స్థానం ఖాయం కావడం... పాక్ జట్టు సెమీస్‌లోనే నిష్ర్కమించడం మూలంగా... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ రౌండ్లో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన మలేసియా, భారత్ జట్లు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచ కప్‌కు అర్హత పొందాయి. హాకీ వరల్డ్ లీగ్‌లో మలేసియా, భారత్ తర్వాత పాకిస్థాన్ ఏడో స్థానంలో నిలిచింది. ఫలితంగా పాకిస్థాన్ ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే కచ్చితంగా ఆసియా కప్ విజేతగా గెలవాల్సింది. సెమీఫైనల్లో పాక్ ఓడిపోవడంతో ప్రపంచ కప్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్... ఆతిథ్య మలేసియా జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ఆడింది. సమన్వయంతో కదులుతూ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దాడులు చేసింది. ఈ క్రమంలో ఆట 8వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. విరామ సమయానికి భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ భారత్ పట్టుదలతో పోరాడింది. ఆట 60వ నిమిషంలో రమణ్‌దీప్ అందించిన పాస్‌ను మన్దీప్ సింగ్ లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 2-0కు పెరగడంతోపాటు విజయమూ ఖాయమైంది.