అండర్-19 స్థాయి క్రికెట్‌లో నగరానికి చెందిన కుర్రాడు ఉమర్ మొహమ్మద్ ఆకట్టుకున్నాడు. అయితే అతను ఆడింది భారత జట్టు తరఫున కాదు.
అండర్-19 వరల్డ్‌కప్‌లో రాణించిన ఉమర్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్థాయి క్రికెట్‌లో నగరానికి చెందిన కుర్రాడు ఉమర్ మొహమ్మద్ ఆకట్టుకున్నాడు. అయితే అతను ఆడింది భారత జట్టు తరఫున కాదు. ఈ టోర్నీలో ఉమర్... యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కుడి చేతి వాటం పేస్ బౌలర్ అయిన ఉమర్ స్వస్థలం హైదరాబాదే. నగరంలోని సన్‌సిటీ (లంగర్‌హౌస్) వద్ద గల బీకే క్రికెట్ అకాడమీలో అతను శిక్షణ పొందాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం అతను దుబాయ్‌లోనే ఉంటున్నాడు.
తరచుగా నగరానికి వచ్చే ఉమర్, ఇదే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాడు. వరల్డ్ కప్ టోర్నీకి ముందు కూడా ఇక్కడే సాధన కొనసాగించాడు. అత్యుత్తమ బౌలింగ్...: తాజాగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో ఉమర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పొదుపైన బౌలింగ్ చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (10-2-24-4) చెలరేగాడు. తమ అకాడమీ ఆటగాడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల బీకే అకాడమీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.