దోహా: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్ తరఫున పెద్ద సంచలనమేమీ నమోదు కాలేదు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత 4గీ400 మిక్సడ్ రిలే టీమ్ అద్భుతం చేయలేకపోయింది. ఫైనల్లో భారత్ 3 నిమిషాల 15:77 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ఈ మెగా టోర్నీలో ప్రవేశపెట్టిన మిక్సడ్‌రిలేలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ అనస్, వీకే విస్మయ, జిస్నా మాథ్యు, నిర్మల్ నోహ్ ఫైనల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. హీట్స్‌లో 3 నిమిషాల 16.14సెకన్ల టైమింగ్‌తో రాణించిన భారత బృందం ఫైనల్లో అంతకన్నా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ పతకానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది.
ఈ పోటీల్లో అమెరికా జట్టు 3 నిమిషాల 09:34 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని, జమైకా బృందం 3నిమిషాల 11:78 సెకన్లతో రజతాన్ని, బహ్రెయిన్ జట్టు 3నిమిషాల 11:82 సెకన్లతో కాంస్యాన్ని గెలుచుకున్నాయి. నేడు జరగనున్న జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ‘ఎ’, ‘బి’ ఈవెంట్‌లో భారత్ నుంచి అన్నూ రాణి (రా.గం 7:00 క్వాలిఫికేషన్ గ్రూప్ ‘ఎ’; రా.గం 8:30; క్వాలిఫికేషన్ గ్రూప్ ‘బి’), మహిళల 200మీ. హీట్స్‌లో అర్చన సుసీంత్రన్ (రా.గం. 7:35), 400మీ. హీట్స్‌లో అంజలి దేవీ (రా.గం. 8:50)తలపడతారు.
పోల్‌వాల్ట్ కొత్త తార సిదొరోవా
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల పోల్‌వాల్ట్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. ఆథరైజ్ న్యూట్రల్ అథ్లెట్ (ఏఎన్‌ఏ) తరఫున బరిలోకి దిగిన రష్యా అథ్లెట్ ఏంజెలికా సిదొరోవా విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఈవెంట్‌లో చివరి వరకు పోరాడిన అమెరికా అమ్మాయి సాండీ మోరిస్ వరుసగా రెండోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో మోరిస్, సిదోరోవా మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఫైనల్లో భాగంగా ఐదు ప్రయత్నాల్లో పోటీపడిన వీరిద్దరూ సమంగా నిలిచారు. చివరగా 4.95మీ. ఎత్తున్న బార్‌ను లంఘించడంలో విజయవంతమైన సిదోరోవా చాంపియన్‌గా నిలిచింది. 4.95మీ. ఎత్తును దూకలేకపోయిన సాండీ మోరిస్ రజతంతోనే సంతృప్తిపడింది. బ్రిటన్‌కు చెందిన కాటరీనా స్టెఫానిది మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకుంది. 2017 లండన్ క్రీడల్లోనూ సాండీ రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment