చెన్నై చెక్కిన చాహర్‌ | Indian Pacer Deepak Chahar Holds World Record | Sakshi
Sakshi News home page

చెన్నై చెక్కిన చాహర్‌

Published Tue, Nov 12 2019 4:04 AM | Last Updated on Tue, Nov 12 2019 4:48 AM

Indian Pacer Deepak Chahar Holds World Record - Sakshi

2018 ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అంతర్గత సమావేశం జరుగుతోంది. ‘పేసర్‌ దీపక్‌ చాహర్‌ రాబోయే లీగ్‌లో 14 మ్యాచ్‌లూ ఆడతాడు. ఇక మనం వేరే ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం’... ఒక యువ బౌలర్‌పై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నమ్మకం అది. అంతటి నాయకుడే విశ్వాసం వ్యక్తం చేసిన తర్వాత ఆ బౌలర్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. తనపై ఉంచిన నమ్మకాన్ని చాహర్‌ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్‌ బౌలింగ్‌ను ప్రదర్శిస్తూ కేవలం 7.28 ఎకానమీతో కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరో రెండు నెలలకే అతనికి భారత జట్టులో చోటు దక్కడం... ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించడం వరకు మిగతావన్నీ అతని ఐపీఎల్‌ ప్రదర్శనకు కొనసాగింపులాంటివే.

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే దీపక్‌ చాహర్‌ సంచలన ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్‌ తరఫున 18 ఏళ్ల  చాహర్‌ బరిలోకి దిగగా... 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి చెత్త రికార్డు నమోదు చేసిన ఆ జట్టు హైదరాబాద్‌. అంతటి అద్భుత ఆరంభం తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెటర్‌ అనిపించుకోవడానికి చాహర్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. అయితే ఆదివారం బంగ్లాదేశ్‌తో ప్రదర్శన తర్వాత ఇకపై చాహర్‌ పేరును మాత్రం ఎవరూ మరచిపోకపోవచ్చు.

గాయాల సమస్యలతో... 
తొలి రంజీ సీజన్‌లో 30 వికెట్లు సాధించి ఘనంగా మొదలైన దీపక్‌ కెరీర్‌ తర్వాతి ఏడాది వచ్చేసరికే తలకిందులైంది. వరుసగా ఎదురైన గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఫలితంగా 2011–12 రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లకే అతను పరిమితమయ్యాడు. అతని ఫిట్‌నెస్‌ సమస్యలను గుర్తించడం వల్లే కావచ్చు... ‘ఎనిమిది వికెట్ల ఘనత’కు రెండేళ్ల ముందు రాజస్తాన్‌ క్రికెట్‌ జట్టు డైరెక్టర్‌గా ఉన్న ఆసీస్‌ దిగ్గజం గ్రెగ్‌ చాపెల్‌ నువ్వు బౌలర్‌గానే పనికి రావంటూ చాహర్‌ను తిరస్కరించాడు. నాటి 50 అత్యుత్తమ ఆటగాళ్లలో కూడా అతనికి చోటివ్వలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఒక్క సంవత్సరానికే ఇలా కావడం దీపక్‌ను మానసికంగా కూడా దెబ్బ తీసింది.

అయితే అతని తండ్రి, ఎయిర్‌ఫోర్స్‌ అధికారి అయిన లోకేంద్ర సింగ్‌ కుమారుడికి అండగా నిలిచి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఈ కుటుంబం స్వస్థలం ఆగ్రా అయినా... ఉద్యోగరీత్యా వారు జైపూర్‌లో స్థిరపడటంతో మొదటి నుంచి చాహర్‌ రాజస్తాన్‌ జట్టునే ఎంచుకున్నాడు. వారి సొంత అకాడమీలోనే అతను స్వింగ్‌ బౌలర్‌గా ఎదిగాడు. కొత్త బంతిని స్వింగ్‌ చేయడంపైనే అతను పూర్తిగా శ్రద్ధ పెట్టాడు. ఇందు కోసం తండ్రి ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ప్రాక్టీస్‌ సెషన్‌కు కొత్త బంతులను సిద్ధం చేసేవాడు. కెరీర్‌ ఆరంభంలో 125 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్‌ చేసిన దీపక్‌... ఆ తర్వాత రాటుదేలి, ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకొని 150 కిలోమీటర్ల స్పీడ్‌కు తన వేగాన్ని పెంచుకోవడం విశేషం.

ధోని అండదండలతో... 
2016, 2017 ఐపీఎల్‌ సీజన్లలో పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టులో చాహర్‌ ఉన్నాడు. తనని ఆడిస్తానంటూ ధోని అప్పుడే మాట ఇచ్చాడు. అయితే లీగ్‌ ఆరంభానికి ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడటంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. చివరి 3 మ్యాచ్‌లు మాత్రం ఆడగలిగాడు. మరుసటి ఏడాది స్మిత్‌ కెప్టెన్‌ కావడంతో అతని ప్రణాళికల్లో చాహర్‌ పనికి రాలేదు. దాంతో 2 మ్యాచ్‌లే దక్కాయి. ధోని మాత్రం మాటంటే మాటే అంటూ 2018లో చెప్పి మరీ చెన్నై జట్టులోకి తీసుకున్నాడు. ఐపీఎల్‌లో సూపర్‌కింగ్స్‌ విజేతగా నిలిచిన తర్వాత అంతా మారిపోయింది. రెండు నెలలకే భారత్‌ తరఫున ఆడే అవకాశం లభించింది. బుమ్రా గాయపడటంతో ఇంగ్లండ్‌తో బ్రిస్టల్‌లో చాహర్‌ అరంగేట్రం జరిగింది.

భువనేశ్వర్‌ తరహాలో కొత్త బంతితో స్వింగ్‌ రాబట్టడం, డెత్‌ ఓవర్లలో పాత బంతితో కట్టడి చేయడం దీపక్‌కు బాగా అబ్బిన విద్య. సాధారణంగా ఐపీఎల్‌లో పవర్‌ప్లేలోని ఆరు ఓవర్లలో మూడు ఓవర్లను చాహర్‌తో ధోని వేయించేవాడు. మొత్తంగా 80 శాతం బంతులు అతను పవర్‌ప్లేలో వేసినవే. ఐపీఎల్‌–2019లో ఒక మ్యాచ్‌లో వరుసగా రెండు ఫుల్‌ టాస్‌ నోబాల్స్‌ వేయడంతో చాహర్‌పై ధోని ఆగ్రహోదగ్రుడైన విషయం అందరూ చూసిందే. అందులో ఒక కెప్టెన్‌గా తన జూనియర్‌పై కోపంకంటే తాను తీర్చిదిద్దిన బౌలర్‌ బాగా ఆడాలనుకునే సాన్నిహిత్యం కనిపించిందంటే తప్పు లేదు!

రెండో మ్యాచ్‌లోనే... 
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డుకు ముందే దాదాపు ఇదే తరహా ప్రదర్శన దీపక్‌ నుంచి వచ్చినప్పుడే అతనిపై అందరికీ నమ్మకం పెరిగింది. ప్రొవిడెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడిన తన రెండో టి20లో 3 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన చాహర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ మినహా మిగిలిన 6 మ్యాచ్‌లలోనూ అతను ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు. ఆసియా కప్‌లో భాగంగా ఏకైక వన్డే ఆడిన చాహర్, టెస్టుల్లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాడు. ప్రపంచ రికార్డు ప్రదర్శనతోనే ఆగిపోకుండా మున్ముందు మరిన్ని అద్భుతాలు చేయగల సత్తా 27 ఏళ్ల దీపక్‌ చాహర్‌లో ఉందనేది మాత్రం వాస్తవం.

ప్రపంచ రికార్డు సాధిస్తానని ఏమాత్రం ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నేను కొత్త బంతితోనే బౌలింగ్‌ చేస్తాను. కానీ నన్ను బుమ్రా తరహాలో వాడుకుంటామని,  కీలకమైన ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి ఉంటుందని రోహిత్‌ భాయ్‌  చెప్పాడు. ఒత్తిడిలో నాపై నమ్మకముంచి బాధ్యత అప్పగించడం సంతోషంగా అనిపించింది. బంతి తడిగా ఉండటంతో పట్టు సాధించడం కష్టమైంది. అయితే చెన్నైలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం పనికొచ్చింది. అక్కడ సాయంత్రం తేమతో పాటు చేతులకు బాగా చెమట పట్టేస్తుంది. చేతులను ఎలా పొడిగా ఉంచుకోవాలో నాకు తెలుసు. సీనియర్లు తిరిగి వచ్చినా... రాబోయే టి20 వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకోవడమే ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం.
–దీపక్‌ చాహర్‌

అదే మలుపు...
రాజస్తాన్‌ జట్టు వరుసగా రెండు సంవత్సరాలు రంజీ ట్రోఫీ విజేతగా నిలవగా, రెండు సార్లూ చాహర్‌ సభ్యుడిగా ఉన్నాడు. కానీ గాయాలతో గతి తప్పిన తర్వాత రెగ్యులర్‌గా అతనికి టీమ్‌లో చోటు లేకుండా పోయింది. అడపాదడపా ఒక్కో మ్యాచ్‌ లభించినా... చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ చాహర్‌ నుంచి రాలేదు. జట్టు రాజకీయాలు కూడా అతడిని ఇబ్బంది పట్టాయి. కొత్త బంతితో కాకుండా నాలుగో బౌలర్‌గా అవకాశం కల్పించడం, పచ్చిక ఉన్న పిచ్‌లపై కాకుండా స్పిన్‌ వికెట్లపైనే మ్యాచ్‌ ఆడించడం, ఒక్కోసారి టీమ్‌ 100కు పైగా ఓవర్లు బౌలింగ్‌ చేసినా ఐదు ఓవర్లే వేసే అవకాశం ఇవ్వడం కూడా చాహర్‌ను గందరగోళ స్థితిలో పడేశాయి.  ఈ దశలో 2016లో జరిగిన ‘రాజస్తాన్‌ క్రికెటర్స్‌ డెవలప్‌మెంట్‌ క్యాంప్‌’ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. క్యాంప్‌లో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్, టి20 స్పెషలిస్ట్‌ కోచ్‌ ఇయాన్‌ పాంట్‌ పర్యవేక్షణలో దీపక్‌ బౌలింగ్‌ పదునెక్కింది. మరో మాజీ క్రికెటర్‌ కాథరీన్‌ డాల్టన్‌ కూడా అతనికి సహకరించింది. తెల్ల బంతిపై చక్కటి నియంత్రణ రావడంతో పాటు అతనిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. సరిగ్గా చెప్పాలంటే దీని తర్వాతే అతను పవర్‌ ప్లే స్పెషలిస్ట్‌గా ఎదిగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement