ముంబై మరీ ఎక్కువ రేటు పెట్టిందన్న డౌల్
న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లతో కూడిన ముంబై జట్టులో కోరీ అండర్సన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అన్నాడు. వేలంలో తనను ఎక్కువ ధర (రూ. 4.50 కోట్లు)కు కొనుగోలు చేశారనే ఉద్దేశంతో అతడు మరింత ఒత్తిడికి లోనై విఫలమవుతున్నాడని డౌల్ పేర్కొన్నాడు. ‘మ్యాక్స్‌వెల్, డ్వేన్ స్మిత్ వంటి వారిని కూడా వదులుకొని ముంబై ఫ్రాంచైజీ అండర్సన్‌ను కొనుగోలు చేసింది. వారిప్పుడు ఇతర జట్ల తరపున అద్భుతంగా రాణిస్తున్నారు.
ఈ కోణంలో కూడా కోరీపై ఒత్తిడి నెలకొని ఉండవచ్చు’ అని డౌల్ అన్నాడు. రోహిత్‌శర్మ, పొలార్డ్, మైక్ హస్సీ వంటి అంతర్జాతీయ స్టార్ల మధ్య రాణించడం అంత తేలికకాదని, కెరీర్ ఆరంభంలోనే అండర్సన్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చి భారీ మొత్తం చెల్లించడం సరికాదని డౌల్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తరపున ఇప్పటికి 7 టెస్టులు, 12 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన 23 ఏళ్ల అండర్సన్.. గత జనవరిలో వెస్టిండీస్‌పై 36 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఐపీఎల్ వేలంలో హాట్‌కేకులా మారిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెటర్‌గా అతడు మరింత రాటుదేలాల్సి ఉందని డౌల్ అన్నాడు.
అండర్సన్‌పై తీవ్ర ఒత్తిడి
Published Mon, May 5 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement