
వాకో సిటీ (జపాన్): బరిలోకి దిగిన తొలి రోజే భారత షూటర్లు అదరగొట్టారు. ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు గెల్చుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రవి కుమార్ కాంస్యం సాధించగా... జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా రజతం దక్కించుకున్నాడు. పురుషుల, జూనియర్ పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్లు మూడు రజత పతకాలు సాధించాయి.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రవి 225.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో రవి, గగన్ నారంగ్, దీపక్‌లతో కూడిన భారత జట్టు (1876.6 పాయింట్లు) రజతం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ (249.7 పాయింట్లు) రజతం నెగ్గాడు. అర్జున్, తేజస్ కృష్ణప్రసాద్, సన్‌మూన్ సింగ్‌లతో కూడిన భారత జట్టు రజతం గెలిచింది. అంజుమ్, మేఘన, పూజాలతో కూడిన భారత మహిళల జట్టు 1247 పాయింట్లతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రజతం గెలిచింది.