
వాకో సిటీ (జపాన్): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ భారత షూటర్ల గురి అదిరింది. శనివారం జూనియర్, యూత్ విభాగాల్లో ఆరు ఈవెంట్స్ జరగ్గా... ఆరింటిలోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల టీమ్ విభాగంలో శ్రేయా సక్సేనా, సమీక్ష ఢింగ్రా, మనీని కౌశిల్‌లతో కూడిన భారత బృందం 1238.1 పాయింట్లతో కాంస్యం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో సమీక్ష ఢింగ్రా 249.6 పాయింట్లతో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తుషార్ మానె 228.2 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నాడు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ పురుషుల టీమ్ విభాగంలో తుషార్ మానె, హృదయ్ హజారికా, మోహిత్ కుమార్ అగ్నిహోత్రిలతో కూడిన భారత బృందం 1863.1 పాయింట్లతో పసిడి పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల యూత్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్ 250.5 పాయింట్లతో స్వర్ణం సంపాదించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల యూత్ టీమ్ విభాగంలో మెహులీ ఘోష్, రక్షణ చక్రవర్తి, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు 1240.5 పాయింట్లతో కాంస్యం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment