Asian Air Gun Championship
-
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
భారత్‌కు పతకాల పంట
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తా చాటుకున్నారు. పోటీలకు ఆఖరి రోజైన సోమవారం భారత్ ఐదు స్వర్ణాలు గెలుచుకుంది. దీంతో పసిడి పతకాల సంఖ్య 16కు చేరుకుంది. ఓవరాల్‌గా భారత్ 25 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. యశ్వర్ధన్, శ్రేయ అగర్వాల్ వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లను కలుపుకొని మూడేసి స్వర్ణాలు గెలుపొందారు. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకం నెగ్గిన యశ్... కెవల్ ప్రజ్పతి, ఐశ్వర్య్ తోమర్లతో కలిసి టీమ్ ఈవెంట్లో మరో పసిడి చేజిక్కించుకున్నాడు. శ్రేయతో కలిసి మిక్స్డ్ ఈవెంట్లోనూ స్వర్ణం నెగ్గాడు. జూనియర్ మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ ఈవెంట్‌తో పాటు మెహులీ ఘోష్, కవి చక్రవర్తిలతో కలిసి టీమ్ ఈవెంట్లోనూ శ్రేయ అగర్వాల్ బంగారు పతకాల్ని గెలిచింది. 10 మీ. ఎయిర్‌రైఫిల్ పోటీలో మెహులీ మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకోగా... కవి చక్రవర్తి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్ ముగిసిందో లేదో మరో చాంపియన్‌షిప్‌కు భారత షూటర్లు సిద్ధమయ్యారు. యూఏఈలో 5 నుంచి జరుగనున్న ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత్ పాల్గొంటుంది. -
భారత్‌కు మరో 3 పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. తైపీలోని తావోయువాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్ ఖాతాలో 3 పతకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ టీమ్ (జూనియర్) విభాగంలో భారత షూటర్లే స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇందులో శ్రేయ అగర్వాల్ – యశ్వర్ధన్ జోడి మొదటి స్థానంలో నిలవగా (497.3 పాయింట్లు)... మేహులి ఘోష్ – కేవల్ ప్రజాపతికి రెండో స్థానం (496.9 పాయింట్లు) దక్కింది. ఈ ఈవెంట్లో కొరియా కాంస్య పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (సీనియర్) విభాగంలో భారత్‌కు వెండి పతకం దక్కింది. ఎలవెనీల్ వలరివన్ – రవి కుమార్ ద్వయం రెండో స్థానంలో (498.4 పాయింట్లు) నిలిచి రజతాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ పోరులో కొరియా (499.6)కు స్వర్ణం దక్కగా, తైపీ కాంస్యం గెలుచుకుంది. మరో భారత జోడి దీపక్ కుమార్ – అపూర్వి చండీలా నాలుగో స్థానంలో నిలిచింది. పోటీల్లో రెండో రోజు ముగిసే సరికి మొత్తం ఐదు పతకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత షూటర్ల జోరు
వాకో సిటీ (జపాన్): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ భారత షూటర్ల గురి అదిరింది. శనివారం జూనియర్, యూత్ విభాగాల్లో ఆరు ఈవెంట్స్ జరగ్గా... ఆరింటిలోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల టీమ్ విభాగంలో శ్రేయా సక్సేనా, సమీక్ష ఢింగ్రా, మనీని కౌశిల్లతో కూడిన భారత బృందం 1238.1 పాయింట్లతో కాంస్యం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో సమీక్ష ఢింగ్రా 249.6 పాయింట్లతో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తుషార్ మానె 228.2 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ పురుషుల టీమ్ విభాగంలో తుషార్ మానె, హృదయ్ హజారికా, మోహిత్ కుమార్ అగ్నిహోత్రిలతో కూడిన భారత బృందం 1863.1 పాయింట్లతో పసిడి పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల యూత్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్ 250.5 పాయింట్లతో స్వర్ణం సంపాదించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల యూత్ టీమ్ విభాగంలో మెహులీ ఘోష్, రక్షణ చక్రవర్తి, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు 1240.5 పాయింట్లతో కాంస్యం దక్కించుకుంది. -
ఐదు పతకాలతో శుభారంభం
వాకో సిటీ (జపాన్): బరిలోకి దిగిన తొలి రోజే భారత షూటర్లు అదరగొట్టారు. ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు గెల్చుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రవి కుమార్ కాంస్యం సాధించగా... జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా రజతం దక్కించుకున్నాడు. పురుషుల, జూనియర్ పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత జట్లు మూడు రజత పతకాలు సాధించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రవి 225.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో రవి, గగన్ నారంగ్, దీపక్‌లతో కూడిన భారత జట్టు (1876.6 పాయింట్లు) రజతం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ (249.7 పాయింట్లు) రజతం నెగ్గాడు. అర్జున్, తేజస్ కృష్ణప్రసాద్, సన్‌మూన్ సింగ్‌లతో కూడిన భారత జట్టు రజతం గెలిచింది. అంజుమ్, మేఘన, పూజాలతో కూడిన భారత మహిళల జట్టు 1247 పాయింట్లతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచింది. -
భారత్ కు మరో రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో భాగంగా మూడు రోజూ కూడా భారత షూటర్లు రాణించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా, జితూ రాయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో గుర్ ప్రీత్ సింగ్, జితూ రాయ్ లు ఫైనల్ కు చేరుకోగా.. గుర్ ప్రీత్ సింగ్ 197.6 పాయింట్లతో రజతాన్ని, జితూ రాయ్ 177.6 పాయింట్లతో కాంస్యాన్ని సాధించాడు. కాగా, ఇరాన్ కు చెందిన బోరౌజెనీ సఫారీ 198.7 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. -
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇక్కడ సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ కు చెందిన అయోనికా పౌల్ కాంస్య పతకాన్ని సాధించింది. భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా పతకం సాధించడంలో విఫలమైనా. . అయోనికా 185.0 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇదే విభాగంలో సింగపూర్ కు చెందిన సెర్ జియాన్ 208 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. ఇదిలా ఉండగా మహిళల 10 మీటర్ల జూనియర్ల విభాగంలో భారత షూటర్ శ్రీయాంక సదాంగి కాంస్యాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 10మీటర్ల పురుషుల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా రెండు పసిడి పతకాలు సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన బింద్రా.. గగన్ నారంగ్, చెయిన్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో కూడా పసిడిని సాధించాడు. -
అభినవ్ బింద్రాకు స్వర్ణం
న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో ఒలింపిక్ చాంపియన్, భారత షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణ పతకం సాధించాడు. 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో 208.3 పాయింట్లు సాధించిన బింద్రా పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఇద్దరు భారత షూటర్లు గగన్ నారంగ్, చైన్ సింగ్ లు వరుసగా నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు. అంతకుముందు ఇదే ఈవెంట్ లో సత్యజీత్ కందోల్ స్వర్ణాన్ని సాధించాడు. సోమవారం జరుగనున్న మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ కు చెందిన అపూర్వ చండేలా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.