దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆదివారం భారత షూటర్లు అద్భుతమే చేశారు. ఏకంగా మూడు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకున్నారు. పురుషుల స్కీట్ విభాగంలో అంగద్ సింగ్ బాజ్వా స్వర్ణం, మేరాజ్ అహ్మద్ ఖాన్ రజతం సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్య పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తాజా ప్రదర్శనతో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా 15 మంది షూటర్లు బరిలోకి దిగనున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 12 మంది... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 11 మంది భారత షూటర్లు పాల్గొన్నారు.
►స్కీట్ విభాగం క్వాలిఫయింగ్‌లో 44 ఏళ్ల మేరాజ్ నాలుగో స్థానంలో, 23 ఏళ్ల అంగద్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో నిరీ్ణత 60 షాట్‌ల తర్వాత అంగద్, మేరాజ్ 56 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య షూట్ ఆఫ్‌ను నిర్వహించగా... అంగద్ 6 పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... 5 పాయింట్లు స్కోరు చేసిన మేరాజ్‌కు రజతం దక్కింది.
►పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 449.1 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, పారుల్ కుమార్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ విభాగంలో కాంస్యం లభించింది.
►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్–అభిõÙక్ వర్మ జంట 16–10తో భారత్‌కే చెందిన సౌరభ్–యశస్విని జోడీపై గెలిచి పసిడి పతకం సాధించింది.
►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సరబ్‌జ్యోత్ సింగ్ (భారత్) ద్వయం 16–10తో మిన్‌సియో కిమ్–యున్‌హో సుంగ్ (కొరియా) జోడీని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment