మాస్టర్ జట్టు ‘బ్లాస్టర్స్’
ఆవిష్కరించిన కేరళ సీఏం
తిరువనంతపురం: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో తమ జట్టు పేరును కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (కేబీఎఫ్‌సీ)గా సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ జట్టు పేరును ఆవిష్కరించారు. ‘మా జట్టుకు కేరళ బ్లాస్టర్స్‌గా పేరు పెట్టాం. ఎందుకంటే నేను క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్‌గా అందరికీ పరిచయం. క్రికెట్ ఆడుతూ పెరిగినప్పటికీ అన్ని ఆటలను ఆస్వాదించాను.
జాతీయ జట్టులో ఉన్నప్పుడు, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్‌లో కూడా ఫుట్‌బాల్ ఆడడం భాగమైపోయింది. ఒకప్పుడు చాలా మంది కేరళ ఆటగాళ్లు భారత ఫుట్‌బాల్ టీమ్‌లో ఉండేవారు. ఐఎస్‌ఎల్ ద్వారా దేశ ఫుట్‌బాల్ ముఖచిత్రాన్ని మార్చే ప్రయతం చేస్తాం’ అని సచిన్ చెప్పాడు.
మరోవైపు ఫుట్‌బాల్‌పై సచిన్ చూపిస్తున్న ఆసక్తిని సీఎం చాందీ అభినందించారు. అలాగే వచ్చే జనవరిలో ఇక్కడ జరిగే జాతీయ క్రీడలకు సచిన్‌ను అంబాసిడర్‌గా వ్యవహరించాలని ఆయన కోరగా అందుకు మాస్టర్ సమ్మతించాడు. లక్షా 25 వేల మంది స్కూల్ చిన్నారులను తమ క్లబ్ తరఫున శిక్షణ ఇస్తామని సచిన్ చెప్పినట్టు తెలిపారు.