గువాహటి: వన్డేల్లో చాలా బాగా ఆడుతున్నా... టి20 క్రికెట్ మాత్రం భారత మహిళల జట్టుకు అచ్చి రావడం లేదు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో మొదలుపెట్టి మంగళవారం ఇంగ్లండ్‌తో తొలి టి20 వరకు మన టీమ్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. సొంతగడ్డపై కూడా జట్టుకు కలిసి రాలేదు. సిరీస్‌లో 0–1తో వెనుకబడిన దశలో భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటి మన జట్టు సిరీస్‌ను సమం చేస్తుందా లేక జోరు మీదున్న ఇంగ్లండ్ 2–0తో సిరీస్ గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం.
తొలి టి20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–4లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. చివర్లో శిఖా పాండే, దీప్తి శర్మ చలవతో స్కోరు అతి కష్టమ్మీద వంద పరుగులు దాటగలిగింది. ఈ నేపథ్యంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన గత మ్యాచ్‌లో అనూహ్యంగా విఫలమైంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఒత్తిడి కూడా ఆమెపై పడి ఉండవచ్చు. మరో ఓపెనర్ జెమీమాతో పాటు కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడిన హర్లీన్ డియోల్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ సిరీస్ తర్వాత టి20ల నుంచి తప్పుకుంటుందని వినిపిస్తున్న మిథాలీ రాజ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆమె ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. వీరితో పాటు వేద కృష్ణమూర్తి కూడా రాణించాల్సి ఉంది. తొలి టి20లో బౌలింగ్‌లో దీప్తి, అరుంధతి, రాధాయాదవ్ పూర్తిగా విఫలమయ్యారు. మొత్తంగా గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకొని బరిలోకి దిగితే స్మృతి సేనకు విజయావకాశం ఉంటుంది.
మరోవైపు వన్డే సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఇంగ్లండ్ సిరీస్ విజయంపై గురి పెట్టింది. మొదటి మ్యాచ్‌ను గెలిపించిన బీమోంట్, కెప్టెన్ హీథెర్ నైట్, వ్యాట్ మరోసారి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ జట్టు బౌలింగ్ కూడా బలంగా ఉంది. బ్రంట్, లిన్సీ స్మిత్, క్రాస్ కలిపి తమ పూర్తి కోటా 12 ఓవర్లలో కేవలం 66 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం భారత్‌ను దెబ్బ తీసింది. ఇదే ఫామ్‌ను కొనసాగించాలని వారు పట్టుదలగా ఉన్నారు. ఈ స్థితిలో భారత్ మ్యాచ్, ఆపై సిరీస్ చేజారిపోకుండా కాపాడుకోగలదా చూడాలి.
Indian women looking to bounce back against England in second T20
Comments
Please login to add a commentAdd a comment