సాక్షి, హైదరాబాద్: షహీద్ భగత్ సింగ్ ట్రోఫీ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. హరియాణాలోని దేవిలాల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో శుక్రవారం ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు చేసింది. షీరెన్ ఖాన్ (26; 1 ఫోర్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లలో సతిరా జాకిర్ జెస్సీ, సనూ అక్తర్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 111 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు నీలమ్ బిష్త్ (4/23), బుష్రా అష్రఫ్ (3/19) వణికించారు.
వీరిద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షహనాజ్ పర్వీన్ (19) టాప్ స్కోరర్. 4 వికెట్లతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన నీలమ్ బిష్త్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హరియాణా పర్యావరణ శాఖ మంత్రి విపుల్ గోయెల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment