T20 trophy
-
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
T20 Trophy: ఓటమితో నిష్క్రమించిన హైదరాబాద్
పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. కేరళతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’ నుంచి మహారాష్ట్ర (16 పాయింట్లు), కేరళ (16 పాయింట్లు) నాకౌట్ దశకు అర్హత సాధించగా... ఒక మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన హైదరాబాద్ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కేరళతో మ్యాచ్‌లో మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 99 పరుగులు చేసింది. రమ్య (27; 3 ఫోర్లు), కీర్తి రెడ్డి (28; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం కేరళ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు సాధించి గెలిచింది. ఇక ఈ విజయంపై స్పందించిన కేరళ కెప్టెన్ సంజన జట్టు సభ్యులను అభినందించింది. చదవండి: IPL 2022: ముంబై ఓటమి నం.8 -
భారత మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: షహీద్ భగత్ సింగ్ ట్రోఫీ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. హరియాణాలోని దేవిలాల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో శుక్రవారం ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు చేసింది. షీరెన్ ఖాన్ (26; 1 ఫోర్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లలో సతిరా జాకిర్ జెస్సీ, సనూ అక్తర్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 111 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు నీలమ్ బిష్త్ (4/23), బుష్రా అష్రఫ్ (3/19) వణికించారు. వీరిద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షహనాజ్ పర్వీన్ (19) టాప్ స్కోరర్. 4 వికెట్లతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన నీలమ్ బిష్త్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హరియాణా పర్యావరణ శాఖ మంత్రి విపుల్ గోయెల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో ఎంఎల్ఆర్ రాయల్స్ మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సిద్ధిపేట్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు సాధించింది. టి. రాజు (42 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. బుద్ధి రాహుల్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్), అమోల్ షిండే (23; 2 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 3 వికెట్లు పడగొట్టగా, అబ్దుల్ రహీమ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఠాకూర్ తిలక్ వర్మ (39 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో మహబూబ్‌నగర్ జట్టు 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. మొహమ్మద్ షకీర్ ఖాన్ (29; 1 ఫోర్, 2 సిక్సర్లు), నీల్ కమల్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఠాకూర్ తిలక్ వర్మ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. ఆదిలాబాద్ టైగర్స్ గెలుపు మరోవైపు ఆదిలాబాద్ టైగర్స్ జట్టు టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది. సిద్ధిపేట్లోనే జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్ కరణ్ కన్నన్ (4/9) విజృంభించడంతో 124 పరుగుల తేడాతో కాకతీయ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ఆదిలాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. బెంజమిన్ (62 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు) ఆకట్టుకోగా... నీరజ్ బిస్త్ (27 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. సాగర్ చౌరాసియా (33; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం 125పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్‌ను కరణ్ దెబ్బ తీశాడు. అతని ధాటికి కాకతీయ జట్టు 16.1 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కరణ్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జి. సదన్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరణ్‌కు లభించింది. -
48 బంతుల్లో సెంచరీ
విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడిన నాయర్ 48 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో చెలరేగిన నాయర్ 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అంతకముందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 42 బంతుల్లో 77 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఊపును తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కూడా కొనసాగించిన నాయర్ శతకంతో మెరిశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన తమిళనాడు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని మూటగట్టుకుంది. -
గోవా శుభారంభం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ముంబై: స్వప్నిల్ అస్నోడ్కర్ (59 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ సూపర్ లీగ్‌లో సౌత్‌జోన్ చాంపియన్ గోవా జట్టు శుభారంభం చేసింది. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో హర్యానాపై విజయం సాధించింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. జోగిందర్ శర్మ (29), రాహుల్ దలాల్ (25) రాణించారు. గడేకర్, గౌరేష్, గార్డ్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గోవా 18 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు చేసింది. డోంగ్రే (29) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. ముంబైలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో బరోడా 7 వికెట్ల తేడాతో బెంగాల్‌పై; కేరళ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందాయి. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా తలపడుతున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌లు ఈనెల 14న జరిగే ఫైనల్లో పోటీపడతాయి. గ్రూప్ ‘ఎ’లో హర్యానా, గోవా, జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, కేరళ, బెంగాల్, బరోడా, రాజస్థాన్ జట్లు ఉన్నాయి. -
మళ్లీ ఓడిన ఆంధ్ర
సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ (సౌత్‌జోన్)లో ఆంధ్ర జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లోనూ గోవా చేతిలో 77 పరుగుల తేడాతో ఆంధ్ర చిత్తుగా ఓడింది. టాస్ నెగ్గిన గోవా తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. కీనన్ వాజ్ (27 బంతుల్లో 53, 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, ఆంధ్ర బౌలర్లలో శివకుమార్, హరీశ్, స్వరూప్, ప్రవీణ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 14.5 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. హరీశ్ (17), శివకుమార్ (12) మినహా అందరూ ఒక్క అంకెకే పరిమితమయ్యారు. గోవా బౌలర్లలో హర్షద్, అమిత్ యాదవ్ చెరో 4 వికెట్లు తీశారు.