గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో చివరి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఒక్కో రజత పతకం లభించింది. టెన్నిస్ అండర్–21 బాలికల డబుల్స్ విభాగంలో సామ సాత్విక–శ్రావ్య శివాని జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో సాత్విక–శ్రావ్య శివాని ద్వయం 6–3, 3–6, 7–10తో మిహికా యాదవ్–స్నేహల్ మానె (మహారాష్ట్ర) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. స్విమ్మింగ్‌లో అండర్–21 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ రజతం సాధించాడు. లోహిత్ 2ని:21.32 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు.
బుధవారంతో ముగిసిన ఈ క్రీడల్లో ఓవరాల్‌గా తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment