అదర గొట్టిన మిథాలీ సేన.. శ్రీలంక లక్ష్యం 233
♦ అర్ద సెంచరీలతో రాణించిన దీప్తీ, మిథాలీ
♦ చివర్లో చితక్కొట్టిన వేద, కౌర్
డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మీథాలీ సేన శ్రీలంకకు 233 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ బ్యాటింగ్ ఉమెన్ లో దీప్తీ శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53)లు రాణించారు. ఇక చివర్లో వేద కృష్ణమూర్తి(29), హర్మన్ ప్రీత్ కౌర్(20) లు దాటిగా ఆడటంతో భారత్ 200 పై చిలుకు పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు స్మృతి మందన(8), పూనమ్ రౌత్(16)లు నిరాశపరచడంతో శుభారంభం అందలేదు. దీంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను దీప్తీ శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు అర్ద సెంచరీలతో గట్టెక్కించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
తొలుత 89 బంతుల్లో దీప్తీ అర్ద సెంచరీ చేసుకోగా మిథాలీ 72 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీప్తీ శర్మ (78) కాంచన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన గోస్వామి(9) నిరాశ పరచగా మరుసటి బంతికే కెప్టెన్ మిథాలీ(53) కూడా ఎల్బీగా అవుటైంది. దీంతో 169 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్ దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. వీరిద్దరూ 52 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక 49 ఓవర్ వేసిన శ్రీపాలి విరొక్కడే వరుస బంతుల్లో వీరిద్దరిని పెవిలియన్ కు చేర్చింది. చివరి ఓవర్లో జోషి రనౌట్ అవ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. భారత మహిళలు చివరి 5 ఓవర్లలో 46 పరుగులు చేయడం విశేషం. ఇక శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి విరొక్కడే 3 వికెట్లు తీయగా రణవీర(2), కాంచన, గుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు.