బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
డెర్బీ:మహిళల ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ తో ఇక్కడ జరుగుతున్న వన్డేలో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపారు.ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్ రౌండర్ శిఖా పాండే స్థానంలో మీడియం పేసర్ మన్షి జోషిని తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు పాకిస్తాన్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ బిస్మా మరూఫ్ స్థానంలో ఇరామ్ జావెద్ ను జట్టులోకి తీసుకోగా, కైనత్ ఇంతియాజ్ స్థానంలో మీడియం పేసర్ దియానా బాయిగ్ కు చోటు కల్పించారు.
పాకిస్తాన్‌పై భారత మహిళలది తిరుగులేని రికార్డు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది. మిథాలీ సారథ్యంలోనే ఏకంగా 8 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక ప్రపంచకప్ చరిత్ర కూడా భిన్నంగా ఏమీ లేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ సేననే విజయం వరించింది. ఇక ఈ చరిత్రను పక్కనపెట్టి... కేవలం ఈ టోర్నీనే పరిశీలిద్దామంటే... ఇందులోనూ భారత్ జోరు, హోరు ఏమాత్రం తక్కువలేదు... ప్రత్యర్థులకు తలొగ్గలేదు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను, రెండో మ్యాచ్‌లో గత రన్నరప్ విండీస్‌ను కంగుతినిపించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మొదలు బౌలర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.