'సెంచరీ కొట్టి.. షాపింగ్ చేసేవాడు'
కోల్ కతా: ఈడెన్ గార్డెన్ లో భారత్-న్యూజిలాండ్ ల మధ్య రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత దిగ్గజ ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టిన మరుసటి రోజు షాపింగ్ కు వెళ్లి తనకు ఇష్టమైన బ్రాండ్ల దుస్తులను కొనుగోలు చేసేవాడని దాదా చెప్పుకొచ్చాడు. సచిన్ కు దుస్తులపై మక్కువ ఎక్కువని తెలిపాడు.
తనతో జట్టులో ఉన్న సమయంలో సచిన్ వార్డ్ రోబ్ నిండా చక్కని దుస్తులు ఉండేవని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ నిత్యం ఆలస్యంగా వచ్చేవాడని తెలిపాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో బ్యాటింగ్ కు దిగాల్సిన పరిస్ధితి ఉన్నా చివరి నిమిషంలో బస్సు వద్దుకు చేరుకునేవాడని చెప్పాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో రాహుల్ ద్రవిడ్, సచిన్, హర్భజన్, సెహ్వాగ్, కుంబ్లేలు అనుకున్న పనిని తమదైన శైలిలో పూర్తి చేసేవారని కొనియాడాడు. వారి కృషే భారతీయ క్రికెట్ ను ప్రపంచదేశాల వరుసలో అగ్రభాగాన నిలబెట్టిందని అన్నాడు.