
లార్డ్స్‌లో గెలిచాక ఏం చేశారో..?
ఒక మ్యాచ్ గెలవగానే సంతృప్తి పడిపోయి ఆ తర్వాత చేతులెత్తేయడం భారత క్రికెట్ జట్టుకు అలవాటైపోయిందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు.
ధోని సేనపై సన్నీ విసుర్లు
న్యూఢిల్లీ: ఒక మ్యాచ్ గెలవగానే సంతృప్తి పడిపోయి ఆ తర్వాత చేతులెత్తేయడం భారత క్రికెట్ జట్టుకు అలవాటైపోయిందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. లార్డ్స్ టెస్టును గెలుచుకున్న అనంతరం మంచి జోష్‌లో కనిపించిన ధోని సేన తర్వాతి టెస్టులో 266 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ‘కచ్చితంగా ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాం.
క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్‌లో వారిని ఓడించి చాలా నిరుత్సాహపరిచాం. కానీ ఆ తర్వాత మధ్యలో ఐదు రోజుల పాటు జట్టు ఆటగాళ్లు ఏం చేశారనేది తెలీదు. మూడో టెస్టు తొలి రోజే ఆటగాళ్లు అలసత్వంతో కనిపించారు. కుక్ క్యాచ్‌ను వదిలేసి అతడి భారీ ఇన్నింగ్స్‌కు తోడ్పడ్డారు. స్లిప్ ఫీల్డింగ్‌తో పాటు చాలా అంశాల్లో మెరుగయ్యేందుకు దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రస్తుత జట్టు చాలా ప్రొఫెషనల్. అందుకే నిర్లక్ష్యాన్ని వదిలించుకోవాలి. ఆరు వికెట్లు చేతిలో ఉన్నా చివరి రోజు భారత ఆటగాళ్లు ఏమాత్రం ప్రతిఘటించకపోవడమే ఓటమికి అసలు కారణం. రహానే మినహా మరెవరూ ఆకట్టుకోలేకపోయారు’ అని గవాస్కర్ విమర్శలు గుప్పించారు.