
క్యాచ్ వదిలారు..మూల్యం చెల్లించుకున్నారు!
చెన్నై:ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ మూడు అద్భుత విజయాలతో సిరీస్ను సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటుకున్న భారత్.. సిరీస్లో తమకు ఎదురులేదని నిరూపించింది. అయితే ప్రత్యేకంగా ఈ సిరీస్ లో భారత్ తన ఫీల్డింగ్ విషయంలో మాత్రం చాలా పేలవంగా ఉంది. రాజ్కోట్ లో జరిగిన తొలి టెస్టులో ఏడు క్యాచ్లను వదిలేసిన విరాట్ సేన.. ఆ తరువాత మొహాలీలో జరిగిన రెండో టెస్టులో నాలుగు క్యాచ్లను జారవిడిచింది.
కాగా, 4-0తో సిరీస్ గెలిచి రికార్డును తిరగరాయాలన్న భారత్.. ఐదో టెస్టులో ఒక కీలకమైన క్యాచ్ను వదిలేసింది. ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ పరుగులేమీ చేయకుండా ఉన్న తరుణంలో అతని క్యాచ్ ను భారత ఫీల్డర్లు వదిలేశారు. మొయిన్ ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ వదిలేశాడు. దాంతో లైఫ్ లభించిన అలీ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి రోజు ఇంగ్లండ్ పైచేయి సాధించడంలో అలీ కీలక పాత్ర పోషించాడు. ఆ క్యాచ్ తరువాత ఎటువంటి అవకాశాన్ని ఇవ్వని అలీ(146) భారీ శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 262 బంతుల్ని ఎదుర్కొన్న అలీ 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఇంగ్లండ్ను పటిష్టస్థితికి చేర్చాడు.
ఫీల్డింగ్ కోచ్ అసంతృప్తి
ఇంగ్లండ్ తో సిరీస్లో భారత జట్టు ఫీల్డింగ్ పై ఆ విభాగంలో కోచ్గా ఉన్న ఆర్.శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరీస్ ను ముందుగానే గెలుచుకన్నప్పటికీ క్యాచ్లను వదిలేయడం నిరాశ గురి చేసిందన్నాడు. క్యాచ్లను పట్టేక్రమంలో టైమింగ్ చాలా ముఖ్యమైనదని భారత క్రికెటర్లకు హితబోధ చేశాడు. క్రికెట్లో ఫీల్డింగ్ పరంగా తప్పులు జరగడం సహజమంటూనే, తమ ఆటగాళ్లు ఫీల్డింగ్ లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు.
ఒకవేళ మొయిన్ అలీ ముందుగానే పెవిలియన్కు చేరి ఉంటే మ్యాచ్ పై పట్టుదొరికేదన్నాడు. గత కొంతకాలం నుంచి వికెట్ల వెనుక ఫీల్డింగ్లో భారత్ బాగా మెరుగుపడినప్పటికీ, ఇంగ్లండ్ తో సిరీస్లో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారన్నాడు.క్యాచ్లను పట్టడంలో వెనుకబడిన పక్షంలో మ్యాచ్ ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందన్నాడు.