మొదటి ‘సన్నాహకం’
తొలి వన్డే ఆదివారం ఉదయం 6.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదే సమయం ఉంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆ మెగా టోర్నీని నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డలపై విశేషంగా రాణించాలి. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాలో ధోనిసేన పర్యటిస్తుంది.
మరి కఠినమైన పరిస్థితులు, విభిన్నమైన ఆకారంలో ఉండే మైదానాలు, బౌన్సీ వికెట్లు ఉండే న్యూజిలాండ్‌లో ఎలా..? దీనికి సమాధానమే ప్రస్తుత పర్యటన. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌ను భారత జట్టు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు (ఆదివారం) జరిగే తొలి వన్డేలో భారత్ ఎలాంటి ప్రయోగాలు చేస్తుందనేది ఆసక్తికరం.
నేపియర్: ప్రస్తుతం భారత వన్డే జట్టులో ఉన్న క్రికెటర్లలో ఒకరిద్దరిని మినహాయిస్తే ఎవరికీ న్యూజిలాండ్‌లో ఆడిన అనుభవం లేదు. కాబట్టి కివీస్‌తో వన్డే సిరీస్ భారత యువ జట్టుకు చాలా కీలకం. సొంతగడ్డపై బెబ్బులిలా చెలరేగే న్యూజిలాండ్... బౌన్సీ వికెట్లతోనే భారత్‌కు స్వాగతం పలికే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భారత యువ బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్ కఠిన పరీక్ష. ఇందులో నెగ్గితే ప్రపంచకప్ జట్టులో బెర్త్ ఖాయం అనుకోవాలి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో భారత్ ఆడే ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇందులో మొదటి మ్యాచ్ రేపు (ఆదివారం) జరుగుతుంది.
‘యువ’ మంత్రం
దక్షిణాఫ్రికాలో భారత బ్యాట్స్‌మెన్ వన్డేల్లో ఘోరంగా విఫలమయ్యారు. వన్డేల్లో న్యూజిలాండ్‌లోనూ అదే తరహా పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుత జట్టులో ధోని, రోహిత్, రైనా తప్ప ఎవరూ గతంలో న్యూజిలాండ్‌లో ఆడలేదు. దీనికి తోడు వన్డే సిరీస్‌కు ముందు ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. ధావన్, కోహ్లి, రాయుడు, రహానేలాంటి వారందరికీ ఇదో పెద్ద పరీక్ష. బౌలింగ్‌లో భారత్ భువనేశ్వర్, షమీ, ఇషాంత్‌లపైనే ఆధారపడొచ్చు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే స్టువర్ట్ బిన్నీకి అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుంది.
46 ఇప్పటి వరకు న్యూజిలాండ్‌తో భారత్ 88 వన్డేలు ఆడితే 46 గెలిచింది. ఐదింటిలో ఫలితం రాలేదు.
10 కివీస్‌లో ఆడిన 29 వన్డేల్లో భారత్ 10 మాత్రమే గెలిచింది. రెండింటిలో ఫలితం రాలేదు.
సొంతగడ్డపై అదుర్స్
బయటి దేశాల్లో న్యూజిలాండ్ ఆటతీరు ఎలా ఉన్నా... సొంత గడ్డపై మాత్రం అంచనాలకు మించి ఆడుతోంది. ఒకరిద్దరు ఆటగాళ్లే కాకుండా జట్టంతా సమష్టిగా రాణిస్తుండం అనుకూలాంశం. ఇటీవల విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
అండర్సన్ ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో)తో చెలరేగితే... చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రైడర్ కూడా దుమ్మురేపాడు. అయితే నిలకడలేమి వాళ్లకు ఇబ్బంది కలిగించే అంశం. టాప్ ఆర్డర్ కుదురుకొని, పేసర్లు సత్తా మేరకు రాణిస్తే.. భారత్‌కు పరీక్ష తప్పదు. సంచలనాలు నమోదు చేయడంలో న్యూజిలాండ్ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి ధోనిసేన అప్రమత్తంగా వ్యవహరించడం చాలా అవసరం.
గెలిస్తే నంబర్‌వన్ పదిలం
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌ను భారత్ (120 రేటింగ్ పాయింట్లు) గెలిచి తీరాలి. ఒకవేళ భారత్ సిరీస్ ఓడిపోయి, అటు ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గనక సిరీస్‌ను గెలిస్తే కంగారూలకు అగ్రస్థానం దక్కుతుంది.
రాయుడుకు చాన్స్ దొరికేనా!
సఫారీ పర్యటనలో బెంచ్‌కే పరిమితమైన హైదరాబాద్ ఆటగాడు తిరుపతి రాయుడుకు ఈ టూర్‌లో అవకాశం వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. యువరాజ్ లేకపోవడంతో అతని స్థానం కోసం రహానే, రాయుడు మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టులతో పాటు ఆడిన ఏకైక వన్డేలో రహానే ఆకట్టుకున్నాడు. కానీ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును బలోపేతం చేయాలంటే రాయుడును న్యూజిలాండ్ పిచ్‌లపై పరీక్షించాలి.