టాప్ కు చేరిన సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: గతేడాది చివర్లో జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రజత పతకం సాధించిన సిరిల్ వర్మ.. పురుషుల జూనియర్ సింగిల్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సిరిల్ వర్మ 11 స్థానాలు ఎగబాకి టాప్ కు చేరాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ లో రన్నరప్గా నిలవడంతో సిరిల్ తన పాయింట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుని ప్రథమ స్థానాన్ని సాధించాడు. ఇదిలా ఉండగా, మరో జూనియర్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చిరాగ్ సేన్ కు మూడో స్థానానికి చేజిక్కించుకోగా, ఫ్రాన్స్ కు చెందిన తోమా పావోవ్ కు రెండో స్థానంలో నిలిచాడు.
మరోవైపు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రెండో ర్యాంకును కాపాడుకోగా, పివి సింధు 12వ ర్యాంకును నిలుపుకుంది. కాగా, స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ అగ్రస్థానంలో , చైనాకు చెందిన లీ జురియ్ మూడో స్థానంలో నిలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కు ఒక్కడికే టాప్ -10 లో స్థానం దక్కింది. శ్రీకాంత్ 9వ ర్యాంకును కైవసం చేసుకోగా,పారుపల్లి కశ్యప్ 15వ స్థానం, ప్రణయ్ 20, అజయ్ జయరామ్ 21 వ స్థానాల్లో నిలిచారు.