అదే జోరు... అదే ఫలితం | India's victory in the second Test | Sakshi
Sakshi News home page

అదే జోరు... అదే ఫలితం

Published Mon, Aug 7 2017 1:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

అదే జోరు... అదే ఫలితం

అదే జోరు... అదే ఫలితం

రెండో టెస్టులోనూ భారత్‌దే విజయం
శ్రీలంకపై ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో గెలుపు
సిరీస్‌ 2–0తో కైవసం
జడేజా మాయాజాలం
12 నుంచి చివరి టెస్టు  


రెండేళ్ల క్రితం శ్రీలంకలోనే భారత్‌ జైత్రయాత్ర మొదలైంది. అప్పటి నుంచి టీమిండియా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకెళుతోంది. ఈ పర్యటనలో ఇన్నింగ్స్‌ తేడాతో...  చరిత్రకెక్కే విజయాన్ని సాధించి భారత్‌ వరుసగా ఎనిమిదో సిరీస్‌నూ   కైవసం చేసుకుంది. తద్వారా వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్ల జాబితాలో ఇంగ్లండ్‌ (8) సరసన సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. మరో సిరీస్‌ గెలిస్తే 9 వరుస సిరీస్‌ విజయాలతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్‌ అందుకుంటుంది.  

కొలంబో: లంకగడ్డపై భారత్‌ మళ్లీ లంకను శాసించింది. మరో రోజు మిగిలుండగానే రెండో టెస్టును... మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో గెలిచింది. రెండో టెస్టులో కోహ్లి సేన ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. లంకలో ఇన్నింగ్స్‌ తేడాతో గెలవడం భారత్‌కిదే మొదటిసారి. భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (5/152) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను స్పిన్‌తో దెబ్బ కొట్టాడు. దీంతో ఆదివారం 209/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఫాలోఆన్‌ ఆడిన శ్రీలంక 116.5 ఓవర్లలో 386 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ కరుణరత్నే (307 బంతుల్లో 141; 16 ఫోర్లు) శతకం సాధించాడు. మిగతా వారిలో ఏంజెలో మాథ్యూస్‌ 36, డిక్‌వెలా 31 పరుగులు చేశారు. హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ చెరో 2 వికెట్లు తీశారు. అజేయ అర్ధశతకంతో పాటు 7 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) వికెట్లు తీసిన జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. చివరి టెస్టు 12 నుంచి పల్లెకెలెలో జరుగుతుంది.

కరుణరత్నే శతకం: గెలుపెలాగో అసాధ్యం కాబట్టి అంతరం తగ్గించే పనిలో... ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ కరుణరత్నే, పుష్పకుమార (16) నింపాదిగా ఆడారు. ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించడమే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేద్దామనుకున్నా భారత బౌలర్ల జోరు దృష్ట్యా అది ఎంతోసేపు సాగలేదు. ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లోనే కరుణరత్నే 95 పరుగుల వద్ద ఔటయ్యేవాడు! కానీ... జడేజా వేసిన ఆ ఓవర్లో షార్ట్‌ లెగ్‌లో ఉన్న రాహుల్‌ క్యాచ్‌ జారవిడవడంతో బతికిపోయాడు. ఆ మరుసటి ఓవర్లోనే కరుణరత్నే 224 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో అశ్విన్, జడేజా చెరో వికెట్‌ తీసి లంక పతనానికి బాటలు వేశారు. ఆ తర్వాత కరుణరత్నేకు మాథ్యూస్‌ జతయ్యాడు. ఇద్దరు లంచ్‌ వరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు.

జడేజా వికెట్ల వేట: రెండో సెషన్‌లో భారత స్పిన్నర్ల  ధాటికి లంక బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. ఇన్నింగ్స్‌ 96వ ఓవర్లో జడేజా వేసిన బంతిని కరుణరత్నే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. గ్లౌవ్స్‌ను తాకుతూ వెళ్లిన బంతి నేరుగా రహానే చేతుల్లో పడింది. తర్వాత మాథ్యూస్, పెరీరా (4) ఇద్దరూ జడేజా బౌలింగ్‌లోనే స్టంపౌటయ్యారు. అనంతరం ధనంజయ డిసిల్వా (17)ను కూడా జడేజానే ఔట్‌ చేయగా, డిక్‌వెలాను హార్దిక్‌ పాండ్యా పెవిలియన్‌ చేర్చాడు. 386 స్కోరు వద్ద ప్రదీప్‌ (1) వికెట్‌ తీసిన అశ్విన్‌ లంక ఇన్నింగ్స్‌ను ముగించాడు.


1     లంకలో భారత్‌కిది తొలి ఇన్నింగ్స్‌ విజయం. ఓవరాల్‌గా 8 టెస్టుల్లో నెగ్గింది. వరుసగా నాలుగు టెస్టుల్లో గెలిచింది.

3     టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు (అశ్విన్, జడేజా) అర్ధసెంచరీలతో పాటు ఐదేసి వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి మాత్రమే.

4     ఏడాది కాలంలో నాలుగు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు అందుకున్న ఏకైక క్రికెటర్‌ జడేజా.

2009 ఫాలోఆన్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ (మెండిస్, కరుణరత్నే) సెంచరీలు చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి. చివరి సారిగా గంభీర్, లక్ష్మణ్‌లు న్యూజిలాండ్‌ పర్యటనలో (2009)లో ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌ టెస్టు క్రికెట్‌లో ఇది 14వ సారి మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement