ఘనంగా ముగింపు | India's victory in the third match | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగింపు

Published Tue, Jul 14 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

ఘనంగా ముగింపు

ఘనంగా ముగింపు

మూడో వన్డేలోనూ భారత్ విజయం
- జింబాబ్వేపై 3-0తో క్లీన్‌స్వీప్  
- అదరగొట్టిన జాదవ్, పాండే

హరారే:
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను భారత కుర్రాళ్లు ఘనంగా ముగించారు. చివరి వన్డేలో భారీ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 83 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (87 బంతుల్లో 105 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మనీష్ పాండే (86 బంతుల్లో 71; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 31; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మద్జివాకు రెండు వికెట్లు దక్కాయి.
 
జింబాబ్వే జట్టు 42.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ చిబాబా (109 బంతుల్లో 82; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించినా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో జింబాబ్వేను కోలుకోనీయలేదు. బిన్నీ మూడు వికెట్లు తీసుకోగా... మోహిత్, హర్భజన్, అక్షర్ రెండేసి వికెట్లు సాధించారు. జాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య రెండు టి20లు ఈనెల 17, 19 తేదీల్లో జరుగుతాయి.

అద్భుత భాగస్వామ్యం
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రహానే (15), విజయ్ (13) ఇద్దరూ విఫలమయ్యారు. ఉతప్ప కొద్దిసేపు నిలకడగా ఆడినా... మనోజ్ తివారీ (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ ఇద్దరూ అవుటయ్యేసరికి భారత్ 82 పరుగులకే నాలుగు వికెట్లతో కష్టాల్లో పడింది. ఈ దశలో జాదవ్‌తో పాటు మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తి సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 67 బంతుల్లో పాండే, 64 బంతుల్లో జాదవ్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్లాగ్ ఓవర్లలో జాదవ్ విశ్వరూపం చూపించడంతో చివరి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు వచ్చాయి. 86 బంతుల్లోనే జాదవ్ సెంచరీ చేశాడు. అంటే రెండో 50 పరుగులను అతను కేవలం 22 బంతుల్లోనే సాధించడం విశేషం. పాండే అవుటయ్యాక వచ్చిన బిన్నీ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా వేగంగా ఆడాడు. జాదవ్ జోరుతో భారత్ మంచి స్కోరు సాధించింది.
 
వరుస విరామాల్లో వికెట్లు
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఓపెనర్ చిబాబా నిలకడగా ఆడినా... మసకద్జ వెంటనే అవుటయ్యాడు. కెప్టెన్ చిగుంబుర (10), చకబ్వా (27), ముతుంబామి (22)లతో చిబాబా చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పినా భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో కట్టడి చేశారు. 33 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.
 
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) ఉత్సెయ (బి) మద్జివా 15; మురళీ విజయ్ (సి) ముతుంబామి (బి) మద్జివా 13; ఉతప్ప (సి) చిగుంబుర (బి) మసకద్జ 31; మనోజ్ తివారీ (సి అండ్ బి) ఉత్సెయ 10; మనీష్ పాండే (సి) రజా (బి) చిబాబా 71; కేదార్ జాదవ్ నాటౌట్ 105; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 276.
వికెట్ల పతనం: 1-25; 2-33; 3-68; 4-82; 5-226.
బౌలింగ్: టిరిపానో 8-0-46-0; మద్జివా 9-0-59-2; చిబాబా 8-0-55-1; మసకద్జ 10-0-31-1; ఉత్సెయ 10-0-41-1; క్రీమర్ 5-0-42-0.
జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జ ఎల్బీడబ్ల్యు (బి) మోహిత్ 7; చిబాబా (సి) జాదవ్ (బి) బిన్నీ 82; చకబ్వా (బి) అక్షర్ 27; చిగుంబుర ఎల్బీడబ్ల్యు (బి) విజయ్ 10; ముతుంబామి ఎల్బీడబ్ల్యు (బి) బిన్నీ 22; సికిందర్ రజా (బి) హర్భజన్ 13; వాలర్ (సి) రహానే (బి) బిన్నీ 5; క్రీమర్ (సి) రహానే (బి) హర్భజన్ 0; ఉత్సెయ (సి) ఉతప్ప (బి) మోహిత్ 0; టిరిపానో నాటౌట్ 13; మద్జివా (స్టం) ఉతప్ప (బి) అక్షర్ 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 193.
వికెట్ల పతనం: 1-16; 2-86; 3-97; 4-150; 5-160; 6-172; 7-172; 8-176; 9-176; 10-193.
బౌలింగ్: భువనేశ్వర్ 6-1-12-0; మోహిత్ శర్మ 7-0-33-2; స్టువర్ట్ బిన్నీ 10-1-55-3; హర్భజన్ సింగ్ 10-0-35-2; అక్షర్ పటేల్ 6.4-0-39-2; మురళీ విజయ్ 3-0-19-1.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement