Huge success
-
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) భారీ విజయం సాధించింది. సంఖ్యాపరంగా తక్కువ అయినప్పటికీ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్న సీపీఎం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. 19,394 గ్రామ పంచాయతీలను టీఎంసీ, 5,050 పంచాయతీలను బీజేపీ గెలుచుకోగా, 1,306 చోట్ల సీపీఎం, 918 చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతోపాటు పంచాయతీ సమితుల ఫలితాల్లోనూ అధికార పార్టీ మంచి ఫలితాలను నమోదు చేసుకుంది. టీఎంసీ 560 పంచాయతీ సమితులను గెలుచుకుని, 350 సమితుల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాలను గెలుచుకుని మరో 16 చోట్ల మెజారిటీ దిశగా సాగుతోంది. జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 55 స్థానాలను గెలుచుకుని 30 చోట్ల పూర్తి ఆధిక్యంలో ఉంది. -
క్లీన్ స్వీప్ చేస్తాం
మిగిలిన మూడు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తాం... తొలి టెస్టు తర్వాత కోహ్లి ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది. తొలి టెస్టులో భారత్ ఆటతీరు చూస్తే ఇది అసాధ్యమేం కాదు. ఉపఖండం బయట అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లి సేన... ఇదే జోరు కొనసాగిస్తే వెస్టిండీస్‌లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. 17 టెస్టుల సుదీర్ఘ సీజన్లో తొలి మ్యాచ్‌లో లభించిన ఈ భారీ విజయం శుభసంకేతం. ⇒ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ⇒ వెస్టిండీస్‌పై తొలి టెస్టులో భారీ విజయం ⇒ ఫలించిన కెప్టెన్, కోచ్ వ్యూహాలు సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్ల క్రితం జమైకాలో భారత జట్టు వెస్టిండీస్‌లో టెస్టు విజయం సాధించింది. ఆ తర్వాతినుంచి తాజాగా ఆంటిగ్వా టెస్టు వరకు ఉపఖండం బయట మన జట్టు 24 మ్యాచ్‌లు ఆడితే 15 టెస్టుల్లో ఓటమిపాలైంది. కోహ్లి సేన గెలిచిన తొలి టెస్టు ఈ మధ్య కాలంలో మనకు రెండో విజయం మాత్రమే. 2014లో లార్డ్స్‌లో మరో విజయం దక్కింది. ఈ గణాంకాలు చూస్తే విదేశీ గడ్డపై మనం సాధించే ఒక్క విజయం కూడా ఎంత విలువైందో అర్థమవుతుంది. వెస్టిండీస్ గతంతో పోలిస్తే ఎంత బలహీనంగా ఉన్నా సరే... టీమిండియా ఘనతను తక్కువ చేయలేం. నాలుగు రోజుల పాటు పూర్తి ఆధిక్యం ప్రదర్శించి మ్యాచ్ గెలుచుకున్న భారత్, ప్రత్యర్థికి ప్రమాదకర సంకేతాలు పంపింది. 17 టెస్టుల సుదీర్ఘ సీజన్లో మొదటి మ్యాచ్‌లోనే భారీ విజయం లభించడం మున్ముందు జరిగే టెస్టులకు కావాల్సిన సన్నాహకంగా చెప్పవచ్చు. ముందుండి నడిపిస్తూ... విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన నాటినుంచి తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నాడు. ఐదుగురు బౌలర్లతో ఆడతానంటూ చెబుతూ వచ్చిన అతను... ఒక బ్యాట్స్‌మన్ తగ్గడం వల్ల తాను అదనపు బాధ్యత తీసుకుంటానన్నట్లు సందేశానిచ్చాడు. ఈ టెస్టులోనూ డబుల్ సెంచరీతో చెలరేగి తను దానిని చేసి చూపించాడు. ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా... విరాట్ బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. రాహుల్ బాగా ఆడుతున్నా ధావన్‌ను నమ్మి తుది జట్టులో చోటివ్వడం ఆశ్చర్యపరిచే నిర్ణయం. అయితే ధావన్ చక్కటి బ్యాటింగ్‌తో కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టాడు. మిశ్రా, సాహా బ్యాటింగ్ కూడా జట్టుకు కలిసొచ్చింది. పేస్, స్పిన్ సమష్టిగా... ఆంటిగ్వా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఎనిమిది, స్పిన్నర్లు రెండు వికెట్లు పడగొడితే... రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఎనిమిది, పేసర్లు రెండు వికెట్లు తీశారు. షమీ, ఉమేశ్‌లకు తోడు అశ్విన్, మిశ్రా చెలరేగగా... వికెట్లు తీయకపోయినా ఇషాంత్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. మొత్తంగా ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు కూడా తమదైన పాత్ర పోషించడం కోహ్లిని చాలా సంతోష పెట్టింది. ‘నా దృష్టిలో ఈ మ్యాచ్ సరిగ్గా మేం ఆశించిన రీతిలో సాగింది. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్‌లో మన పేసర్లు రాణించడం సహజం, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఆ బాధ్యత తీసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడం, రెండు రోజుల్లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయడం మా వ్యూహాలకు సరిగ్గా సరిపోయింది’ అని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశాడు. విదేశాల్లో కూడా మన ఆధిపత్యం ప్రదర్శించే సమయం ఆసన్నమైందని ప్రకటించాడు. అంతా అశ్విన్ ఈ మ్యాచ్‌ను ‘అశ్విన్ టెస్టు’గా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. పూర్తి స్థాయిలో, నమ్మదగిన ఆల్‌రౌండర్‌గా అతను కనిపించాడు. 33 టెస్టులకే క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథంతో పోలికలు తెచ్చే గణాంకాలు అతను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయకపోయినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను సత్తా చూపించాడు. 22 ఓవర్ల పాటు చంద్రిక, శామ్యూల్స్ జోడి నిలబడినప్పుడు చక్కటి బంతితో ఈ జోడీని విడదీసిన అతను, చివర్లో 24.1 ఓవర్ల పాటు ఇబ్బంది పెట్టిన తొమ్మిదో వికెట్ జంటను పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌కు అందించాడు. ఇక అశ్విన్‌ను ఈ సిరీస్‌లో సమర్థంగా ఎదుర్కోవడం విండీస్ వల్ల అవుతుందా అనేది సందేహమే. గతంలో టెస్టుల్లో రెండు సెంచరీలు చేసినా... అశ్విన్ బ్యాటింగ్‌పై ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. కానీ కీపర్ సాహాకంటే ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన అతను తన బ్యాటింగ్ విలువను సాధికారికంగా ప్రదర్శించాడు. స్టాన్స్ మార్చుకోవడంతో పాటు ఆఫ్‌స్టంప్‌పై పడే బంతులను ఆడటంపై పట్టు సాధించాడు. ఇది ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు కోహ్లికి కావాల్సిన ధైర్యాన్నిచ్చింది. తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు భారత్ తొలి ఇన్నింగ్స్: 556/8 డిక్లేర్డ్ (కోహ్లి 200, అశ్విన్ 113) వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 243 (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 74, డౌరిచ్ 57 నాటౌట్, ఉమేశ్ 4/41, షమీ 4/66) వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 231 (కార్లోస్ బ్రాత్‌వైట్ 51 నాటౌట్, శామ్యూల్స్ 50, అశ్విన్ 7/83). 1 ఉపఖండం బయట భారత్‌కు ఇదే (ఇన్నింగ్స్, 92 పరుగులు) అతి పెద్ద విజయం. వెస్టిండీస్ గడ్డపై భారత్ తొలి సారి ఇన్నింగ్స్ విజయం సాధించింది. 1 విండీస్ గడ్డపై భారత్ తరఫున అశ్విన్ (7/83)దే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. 3 ఒకే టెస్టులో సెంచరీ చేసి 7 వికెట్లు తీసిన మూడో ఆటగాడు అశ్విన్ (గతంలో జాక్ గ్రెగరీ, బోథమ్). 17 అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి. కేవలం 33 టెస్టుల్లోనే అతను ఈ ఘనత సాధించాడు. కెరీర్లో 33 టెస్టులు ఆడే సమయానికి స్పిన్నర్లలో ఇదే బెస్ట్ కాగా... ఓవరాల్‌గా వఖార్ యూనిస్ (19 సార్లు) తర్వాత అశ్విన్ రెండో స్థానంలో ఉండటం విశేషం. -
మూడో వన్డేలోనూ భారత్ విజయం
-
ఘనంగా ముగింపు
మూడో వన్డేలోనూ భారత్ విజయం - జింబాబ్వేపై 3-0తో క్లీన్‌స్వీప్ - అదరగొట్టిన జాదవ్, పాండే హరారే: జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను భారత కుర్రాళ్లు ఘనంగా ముగించారు. చివరి వన్డేలో భారీ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 83 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (87 బంతుల్లో 105 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మనీష్ పాండే (86 బంతుల్లో 71; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 31; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మద్జివాకు రెండు వికెట్లు దక్కాయి. జింబాబ్వే జట్టు 42.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ చిబాబా (109 బంతుల్లో 82; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించినా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో జింబాబ్వేను కోలుకోనీయలేదు. బిన్నీ మూడు వికెట్లు తీసుకోగా... మోహిత్, హర్భజన్, అక్షర్ రెండేసి వికెట్లు సాధించారు. జాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య రెండు టి20లు ఈనెల 17, 19 తేదీల్లో జరుగుతాయి. అద్భుత భాగస్వామ్యం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రహానే (15), విజయ్ (13) ఇద్దరూ విఫలమయ్యారు. ఉతప్ప కొద్దిసేపు నిలకడగా ఆడినా... మనోజ్ తివారీ (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ ఇద్దరూ అవుటయ్యేసరికి భారత్ 82 పరుగులకే నాలుగు వికెట్లతో కష్టాల్లో పడింది. ఈ దశలో జాదవ్‌తో పాటు మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తి సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 67 బంతుల్లో పాండే, 64 బంతుల్లో జాదవ్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్లాగ్ ఓవర్లలో జాదవ్ విశ్వరూపం చూపించడంతో చివరి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు వచ్చాయి. 86 బంతుల్లోనే జాదవ్ సెంచరీ చేశాడు. అంటే రెండో 50 పరుగులను అతను కేవలం 22 బంతుల్లోనే సాధించడం విశేషం. పాండే అవుటయ్యాక వచ్చిన బిన్నీ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా వేగంగా ఆడాడు. జాదవ్ జోరుతో భారత్ మంచి స్కోరు సాధించింది. వరుస విరామాల్లో వికెట్లు జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఓపెనర్ చిబాబా నిలకడగా ఆడినా... మసకద్జ వెంటనే అవుటయ్యాడు. కెప్టెన్ చిగుంబుర (10), చకబ్వా (27), ముతుంబామి (22)లతో చిబాబా చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పినా భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో కట్టడి చేశారు. 33 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) ఉత్సెయ (బి) మద్జివా 15; మురళీ విజయ్ (సి) ముతుంబామి (బి) మద్జివా 13; ఉతప్ప (సి) చిగుంబుర (బి) మసకద్జ 31; మనోజ్ తివారీ (సి అండ్ బి) ఉత్సెయ 10; మనీష్ పాండే (సి) రజా (బి) చిబాబా 71; కేదార్ జాదవ్ నాటౌట్ 105; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1-25; 2-33; 3-68; 4-82; 5-226. బౌలింగ్: టిరిపానో 8-0-46-0; మద్జివా 9-0-59-2; చిబాబా 8-0-55-1; మసకద్జ 10-0-31-1; ఉత్సెయ 10-0-41-1; క్రీమర్ 5-0-42-0. జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జ ఎల్బీడబ్ల్యు (బి) మోహిత్ 7; చిబాబా (సి) జాదవ్ (బి) బిన్నీ 82; చకబ్వా (బి) అక్షర్ 27; చిగుంబుర ఎల్బీడబ్ల్యు (బి) విజయ్ 10; ముతుంబామి ఎల్బీడబ్ల్యు (బి) బిన్నీ 22; సికిందర్ రజా (బి) హర్భజన్ 13; వాలర్ (సి) రహానే (బి) బిన్నీ 5; క్రీమర్ (సి) రహానే (బి) హర్భజన్ 0; ఉత్సెయ (సి) ఉతప్ప (బి) మోహిత్ 0; టిరిపానో నాటౌట్ 13; మద్జివా (స్టం) ఉతప్ప (బి) అక్షర్ 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1-16; 2-86; 3-97; 4-150; 5-160; 6-172; 7-172; 8-176; 9-176; 10-193. బౌలింగ్: భువనేశ్వర్ 6-1-12-0; మోహిత్ శర్మ 7-0-33-2; స్టువర్ట్ బిన్నీ 10-1-55-3; హర్భజన్ సింగ్ 10-0-35-2; అక్షర్ పటేల్ 6.4-0-39-2; మురళీ విజయ్ 3-0-19-1.