బౌలర్లు ప్రత్యర్థి టెయిలెండ్‌ను కూల్చలేకపోయారు... బ్యాటింగ్‌లో ‘ప్రారంభ’ సమస్య మరోసారి స్పష్టమైంది. మిగతా బ్యాట్స్‌మెన్ కుదురుకుంటున్న సమయంలో వర్షం అడ్డుగా నిలిచింది. మొత్తానికి మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు ‘ప్రాక్టీస్’ తక్కువే. టీమిండియా చేతిలో ఆలౌట్ కాకూడదన్న ఉద్దేశంతో ఆడిన ఎస్సెక్స్... అందుకు తగ్గట్లే ఆడి డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రహానే, రాహుల్‌లకు కొంత ప్రాక్టీస్ లభించింది.
చెమ్స్‌ఫోర్డ్: సుదీర్ఘ సిరీస్‌కు ముందు టీమిండియా ఏకైక సన్నాహం ముగిసింది. కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ అయింది. శుక్రవారం వాన కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 36 నాటౌట్; 7 ఫోర్లు)తో పాటు అజింక్య రహానే (27 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) నిలకడ చూపారు. అయితే, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. డిపెండబుల్ బ్యాట్స్‌మన్ పుజారా (23) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.
ఆశ్విన్, కుల్దీప్ బౌలింగ్ చేశారు...
ఓవర్‌నైట్ స్కోరు 236/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఎస్సెక్స్... పేసర్లు ఉమేశ్ యాదవ్ (4/35), ఇషాంత్ శర్మ (3/59) ధాటికి ఎదురునిలిచి 359/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫోస్టర్ (42) త్వరగానే వెనుదిరిగినా వాల్టర్ (75) అర్ధ శతకం సాధించాడు. నిజ్జర్ (29 నాటౌట్), ఫిన్ ఖుషి (14 నాటౌట్) పది ఓవర్లకు పైగా వికెట్ కాపాడుకున్నారు. భారత బౌలర్లు 94 ఓవర్లు వేసినా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయారు. గురువారం గాయంతో బౌలింగ్‌కు దిగని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ శుక్రవారం బంతిని అందుకుని ఐదు ఓవర్లు వేశాడు. కుల్దీప్‌యాదవ్ సైతం నాలుగు ఓవర్లు వేశాడు. పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొడుతూ ఉమేశ్‌యాదవ్ ప్రభావవంతంగా కనిపించాడు. మొహమ్మద్ షమీ మాత్రం నిరుత్సాహపర్చాడు. తలా ఒక ఓవర్ వేస్తూ తీవ్రంగా ప్రయత్నించినా ఎస్సెక్స్‌ను ఆలౌట్ చేయలేకపోవడం గమనార్హం.
మళ్లీ శుభారంభం దక్కలేదు...
భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లోను శుభారంభం దక్కలేదు. మురళీ విజయ్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ సౌకర్యంగానే ఆడినా, శిఖర్ ధావన్ మూడు బంతులే ఎదుర్కొని క్విన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. బౌండరీలతో టచ్‌లో ఉన్నట్లు కనిపించిన చతేశ్వర్ పుజారాను వాల్టర్ వెనక్కుపంపాడు. అనంతరం రాహుల్, అజింక్యా రహానే జంట ఇబ్బంది లేకుండా ఆడుతూ మూడో వికెట్‌కు 49 పరుగులు జత చేసింది. వర్షం కారణంగా చివరి రోజు ఓవరాల్‌గా 57.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. గంటన్నర ముందే మ్యాచ్ ముగిసింది.
ధావన్... ఇలాగైతే కష్టమే..!
శిఖర్ ధావన్... భారత జట్టులో ఏకైక ఎడమచేతి వాటం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ సభ్యుడు. కేఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతుడిని కాదని మరీ అవకాశాలు దక్కించుకుంటున్న ఆటగాడు. అయితే, టి20లు, వన్డేల వరకైతే ఉపయుక్తమైన వాడే. టెస్టుల్లోకి వచ్చేసరికే అతడి ప్రదర్శన విమర్శకులకు పని కల్పిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో అసలు ధావన్ అవసరం ఉందా? అనిపిస్తోంది. తాజాగా ఎస్సెక్స్ వంటి కౌంటీ జట్టుపై సన్నాహక మ్యాచ్‌లోనే శిఖర్ ‘పెయిర్’ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగిన అతను... రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ధావన్‌ను ఆడించాలా వద్దా అని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తుందనడంలో సందేహం లేదు. అతనితో పోలిస్తే రాహుల్ మెరుగ్గా ఆడుతుండటం, విజయ్ విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం కూడా ధావన్‌కు స్థానంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ప్రతాపమంతా ఉపఖండంలోనే...
కెరీర్‌లో ఇప్పటివరకు 30 టెస్టులు ఆడిన ధావన్ సగటు 43.93. ఓ విధంగా మంచి బ్యాట్స్‌మన్ గణాంకమే. కానీ, ఇదంతా కాగితంపైన చెప్పుకొనేందుకే. ఎందుకంటే అతడి ప్రతాపమంతా ఉపఖండంలోనే. ఇక్కడ 16 టెస్టుల్లో (24 ఇన్నింగ్స్) 61 సగటుతో 1,403 పరుగులు చేసిన శిఖర్... విదేశీ పిచ్‌లపై కుదేలవుతున్నాడు. ఇప్పటివరకు విదేశాల్లో 14 టెస్టుల్లో 26 ఇన్నింగ్స్‌లలో 750 పరుగులే చేయగలి గాడు. సగటు 22 మాత్రమే. ఈ దారుణ గణాంకాల మధ్య కూడా అతడిని కాపాడుతోంది ఎడమ చేతివాటం, పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల ఫామ్ మాత్రమే. అప్పటికీ దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి టెస్టు వైఫల్యంతో పక్కనబెట్టారు. అయితే, అప్పుడు రాహుల్ కూడా రాణించకపోవడంతో మెరుగైన ప్రత్యామ్నాయంగా ధావనే మిగిలాడు. ఈ మధ్యలో సొంతగడ్డపై అఫ్గాన్‌తో టెస్టులో మెరుపు శతకం బాదడం మరిన్ని అవకాశాలిచ్చేలా చేసింది.
గత పర్యటనలోనూ విఫలం...
2014 ఇంగ్లండ్ పర్యటన సమయంలో ధావన్ ఫామ్‌లో ఉన్నాడు. అయినప్పటికీ మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 122 మాత్రమే. అత్యధికం 37. మరోవైపు వికెట్ల మధ్య తన పరుగు నిదానంగా ఉంటూ రనౌట్లకు అవకాశం ఇస్తోంది. దీనినిబట్టి చూస్తే ఈసారి అతడి కంటే రాహుల్‌ను నమ్ముకోవడమే ఉత్తమం అనిపిసోంది.
Comments
Please login to add a commentAdd a comment